చెరువులను మింగేశారు.. వైసీపీ వీరంగం.. కేటీఆర్ కంప్లైంట్.. మెట్రో కష్టాలు.. టాప్ న్యూస్@8PM
posted on Nov 24, 2021 @ 6:50PM
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుచానూరులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక వృద్ధుడని, ప్రజల్లో తిరగలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు
-------
గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీమూకలు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్ పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీనిపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ ను మించిపోయిందని మండిపడ్డారు.
-------
రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై జగన్‌ను బీసీ నేతలు కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
--------
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.
----
ఇటీవలి భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలను, రెండు ఘాట్‌రోడ్లలోని కొండచరియలను ఐఐటీ నిపుణులకు టీటీడీ అధికారులు చూపించారు. కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలకు సంబంధించి ఐఐటీ నిపుణులు త్వరలో సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందించనున్నారు.
----------
జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు.. జీహెచ్ఎంసీ కార్యాలయపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారని ఆయన ట్వీట్ చేశారు. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు కేటీఆర్.
-----------
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పురాణకాలపు మూసీనది, హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరు తెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని ఆమె అన్నారు. మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని... ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుందని విజయశాంతి మండిపడ్డారు
----
హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు వస్తున్నాయని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మెట్రో ఆర్థిక ఇబ్బందులను వివరించామని తెలిపారు. మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారని చెప్పారు. ఆరు వారాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపంచడంలేదన్నారు. మెట్రోకు రోజుకు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, గత త్రైమాసికంలో మెట్రోకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.
-------
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి.
---
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.