ఒమిక్రాన్‌ డేంజరే.. టీకాలు పని చేయకపోవచ్చు! ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సంచలనం..   

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. మన దేశంలో ఇప్పటివరకు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరికి, మహారాష్ట్రలోన్ థానేలో మరొకరికి కొత్త వైరస్ నిర్దారణ అయింది. ఈ ముగ్గురు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారే. ఒమిక్రాన్ సోకిన రోగుల కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్టులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.   ఒమిక్రాన్ కు సంబంధించి ఎయిమ్స్ డెరెక్టర్ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సంచలన విషయాలు చెప్పారు. అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు తెలిపారు. అందుకే దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే  ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఎయిమ్స్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.   భారత్‌లో వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లతో పాటు అన్ని టీకాల సమర్థతను క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలుబడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ గులేరియా చెప్పారు.  ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు స్థానికంగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. వీటితోపాటు రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారు త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే పలుదేశాల్లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి భారత్‌లోని కొవిడ్‌ జీనోమ్‌ కన్సార్టియం ఇన్సాకోగ్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తోందని వెల్లడించింది.   ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఈ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌ నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అనంతరం బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్‌పై సమీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..  ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. అనంతరం దీనికి ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది.   

ప్రముఖులు వస్తే ఆయన ఉండాల్సిందే.. తిరుమలతో డాలర్ కు ప్రత్యేక అనుబంధం..    

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణంతో టీటీడీ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు ఆయనకు సంఘీభావం తెలిపారు.  స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలపై డాలర్ శేషాద్రికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో డాలర్‌ శేషాద్రి సేవలను టీటీడీ సిబ్బంది, అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 2007లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయనకున్న విశేషానుభవం దృష్ట్యా తిరుమల ఆలయ ఓఎస్డీగా కొనసాగిస్తోంది టీటీడీ. ప్రముఖులు ఎవరైనా తిరుమల వస్తే డాలర్‌ శేషాద్రి కచ్చితంగా అక్కడ ఉండేవారు. ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు ఆయన కనిపించకపోతే.. డాలర్ ఎక్కడా అని వాళ్లు వాకబు చేసేవారు. అంతగా తిరుమలతో డాలర్ శేషాద్రికి అనుబంధం ఉంది. 1978 నుంచి తితిదే వ్యవహారాల్లో ఉండటంతో ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి వస్తే ఆయన దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌, ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌, నరేంద్ర మోదీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వారితో డాలర్‌ శేషాద్రి అక్కడ కనిపించేవారు.   

జగన్ కు బిగ్ షాక్.. అమరావతికి వైసీపీ ఎమ్మెల్యే మద్దతు..

మూడు రాజధానుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాకిచ్చారు. రాజధానులపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైసీపీ చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులను ఎమ్మెల్యే కోటంరెడ్డి  కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని.. తప్పకుండా సహకరిస్తానన్నారు. ‘జై అమరావతి’ అనాలని రైతులు కోరగా శ్రీధర్‌రెడ్డి సున్నితంగా వారించారు. ఆ మాట అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులున్నాయని వ్యాఖ్యానించారు.  అమరావతి రైతులను వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉంటారనే పేరున్న శ్రీధర్ రెడ్డి.. అమరావతికి సంఘీభావం తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. శ్రీధర్ రెడ్డి బాటలోనే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, కాని ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారనే టాక్ వస్తోంది.

ఒమిక్రాన్ వైరస్ అంత డేంజరా? పెను ముప్పు తప్పదా?  ఇండియాకు కొత్త వేరియంట్ వచ్చేసిందా? 

దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొన్ని రోజులుగా కొంత సద్దుమణిగినట్లు అనిపించింది. వైరస్ పీడ పోతుందని ప్రపంచ దేశాలు ఊపిరీ పీల్చుకుంటున్న సమయంలోనే మరో రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది.  ప్రస్తుతం కరోనా వైరస్ ఓ కొత్త  వేరియెంట్  ఒమిక్రాన్ రూపంతో మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలంతా మళ్లీ వణికిపోతున్నారు. అసలీ ‘ఒమిక్రాన్ అనే వేరియెంట్ ఏమిటి? దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? ఒమిక్రాన్ ను కంట్రోల్ చేయడం కష్టమా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న విషయాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. హాంగ్ కాంగ్ లో క్వారంటైన్ కోసమే ఉద్దేశించిన ఓ హోటల్ లో ఒక  రూమ్ లోని ఓ వ్యక్తికి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్  వచ్చింది. ఆయన దక్షిణాఫ్రికా నుంచి రావడంతో ఎందుకైనా మంచిదని ఎదుటి రూమ్ లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి రాని వ్యక్తికి కూడా పరీక్ష చేయించారు. అయితే ఎదుటి రూమ్ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో అంతా షాకయ్యారు. ఇద్దరూ కూడా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారే కావడం మరింత కలవరపరుస్తోంది.  ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఎదుటి గదిలో ఉన్న వ్యక్తికి కూడా ‘డెల్టా’ వేరియెంట్ కన్నా  అత్యంత వేగంగా వ్యాపించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. కరోనా వైరస్ కి కొత్త కొత్త వేరియంట్లు రావడం సహజమే. కాని ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతే డెల్టాను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా పేర్కొన్నారు. కానీ... ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ వేరియంట్ విస్తృతంగా ఉన్న సౌతాఫ్రికా నుంచి విమానాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి.  ఆ జన్యు ఉత్పరివర్తనాలు ఒక మేరకు మించి జరిగినప్పుడు అది అంతకుముందున్న వేరియంట్ కంటే పూర్తిగా భిన్నమైనదని శాస్త్రవేత్తలు భావించినప్పుడు... దాన్ని ‘కొత్త వేరియంట్ గా పిలుస్తారు. ఇప్పటివరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్. కరోనాకి  సంబంధించిన వేరియంట్లలో ఉత్పరివర్తనాల విషయంలో ఇది రారాజు లాంటిది.  ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు... ఒక్క దాని స్పైక్ ప్రోటీన్ లోనే  ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో కూడా ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్ అనే భాగంలో మూడు ఉత్పరివర్తనాలు ఉండటం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్ కి యాంటీబాడీస్ ను బైపాస్ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల అంచనా. ఎందుకంటే కరోనా వైరస్ మానవ శరీరంలో ప్రవేశించాలంటే దాని స్పైక్ ప్రోటీన్ ను... మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది.  యాంటీబాడీస్ తయారుచేయడానికీ, వ్యాక్సిన్ లను రూపొందించడానికీ, మందుల తయారీకీ  శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్‌ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు...  ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్ మన శరీర కణాలలోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే  అవకాశం ఉంటుంది. రెండవది... మనం తయారుచేసుకున్న వాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక... అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్.. ఈ వైరస్‌ని గుర్తించలేకపోవచ్చు. మూడవది... మనం తయారుచేసుకున్న యాంటీవైరల్‌ మందులు ఈ వేరియంట్ పైన పని చేయకపోవచ్చు. నాలుగోది... మనం తయారుచేసుకున్న సింథటిక్ యాంటీబాడీస్ ఈ వైరస్‌ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్ వేరియంట్ కు కొన్ని ‘సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వేరియంట్లలో ముఖ్యమైనది ఎక్కువ వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం. రెండోది... ఎక్కువమందిని ప్రాణాపాయానికి గురిచేసే అవకాశం. మూడోది... ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్ ... అలాగే సహజంగా ఇన్ఫెక్షన్  తర్వాత దేహంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను సమర్థంగా ఎదుర్కొని రోగుల మీద దాడి చేయగలిగే సామర్థ్యం. ఒమిక్రాన్‌ విషయంలోఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందనడానికి కొన్ని ఆధారాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్  డెల్టా వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండోది... ఈ వైరస్ సౌత్ ఆఫ్రికా నుంచి హాంకాంగ్ కి చేరుకున్న తర్వాత అక్కడ క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చాలా తేలికగా సోకింది. బెల్జియం, ఇజ్రాయిల్‌ మొదలైన దేశాలకు కూడా ఈ వేరియంట్ ఇప్పటికే పాకింది. మొట్టమొదటగా ఈ వేరియంట్ ని బోట్స్ వానా, దక్షిణాఫ్రికాలలో గుర్తించారు. అక్కడ్నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్ కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్ ని ముందుగా బి.1.1.529 అని పిలిచారు. డబ్ల్యూహెచ్ ఓ దీన్ని ‘వేరియంట్  ఆఫ్ కన్సర్న్ గా గుర్తించగానే దీనికి గ్రీక్ ఆల్ఫాబెట్‌ లో 15వ  అక్షరమైన ‘ఒమిక్రాన్  అనే పేరు పెట్టారు. 

ఏపీ గవర్నర్ కు మళ్లీ సీరియస్.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోమారు అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు గతరాత్రి మళ్లీ సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం గవర్నర్ కు గచ్చిబౌలిలోని  ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది.   జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్‌‌కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో  17న అత్యవసరంగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆదివారం రాత్రి మరోమారు గవర్నర్  అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి. గవర్నర్‌కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. 

వెండి తెర మీదేనా మీ హీరోయిజం.. వరద బాధితులకు ఉండదా మీ సాయం! 

సోనూసూద్.. విలన్‌గా తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో వదల బొమ్మాళి వదలా... అంటూ తన నట విశ్వరూపంతో చెలరేగిపోయాడు. కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన నాటి నుంచి.. నేటి వరకు.. ఆపదలో ఉన్నవారికి నేను సైతం అంటూ.. ఆపన్న హస్తం అందిస్తున్నారీ సోనూసూద్.  ఇటీవల చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో ఆయా జిల్లాల్లో పలు కాలనీలు నీట మునిగగా, వరదలతో పలు కాలనీలకు కాలనీలు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక, అన్నం పెట్టే నాధుడు లేక, సాయం, సహాయం అందించేవారు లేక ప్రజలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు వస్తు సామాగ్రితోపాటు నిత్యవసర వస్తువుల కిట్ బ్యాగ్‌లను అందజేయాలని ఆయన స్పంకల్పించారు. ఆ క్రమంలో వాటిని ఆయన నెల్లూరు జిల్లాకు పంపారు. వాటిని బాధితులకు అందించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ వైపు సోనూసూద్ వరద బాధితులకు సాయంపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు టాలీవుడ్ హీరోలోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే.. ఆషా మాషీ కాదని.. రెన్యూమరేషన్, విదేశాల్లో షూటింగ్ స్పాట్లు.. ఫైటింగులు, ఛేజింగులు.. ఇలా అన్నింటిలో బాలీవుడ్‌ ఇండస్ట్రీతో పోటా పోటీ ఇస్తుందీ మన టాలీవుడ్. మరీ అలాంటి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న.. చోటు చేసుకోంటున్న విపత్తులకు వీసమెత్తు సాయం కూడా ఎందుకు చేయడం లేదని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో సదరు హీరోలు.. తమ సినిమాల్లో కంటి చూపుతో రైళ్లను ఆపగలరు, తొడకొట్టి గాల్లోకి సూమోలు లేపగలరు, తమ డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరు, ఇక డ్యాన్స్‌లు, ఫైటింగ్స్‌ వస్తే మాత్రం సదరు హీరోల ఫ్యాన్స్‌లకు పూనకాలే పునకాలు. ఇక టాలీవుడ్ హీరోలు చేసే విన్యాసాలకు కరెన్సీ కాగితాలు, రూపాయి నాణెలు, పూల దండలు వెండి తెరపై వర్షమై పడుతోంటుంది.  టాలీవుడ్ హీరోలు తీసుకునే రెన్యూమరేషన్ ఏమైనా తక్కువా అంటే అదీ కాదు. అంతా కోట్ల రూపాయిల్లోనే వ్యాపారం. ఇటు సినిమాలే కాకుండా అటు యాడ్స్‌లో సైతం నటిస్తూ.. సినిమాలతో సమానంగా యాడ్స్‌ ద్వారా  పైసా తక్కువ కాకుండా సంపాదిస్తున్నారీ ఈ హీరోలు. ఈ హీరోల కళా పోషణ సైతం వెండి తెరపైనే కాదు బుల్లి తెరపైన మనం కళ్లు అప్పగించి మరీ చూస్తున్నాం. మరి వీరికీ ఎంత సేపు తమ కులం, తమ ప్రాంతం, తమ వాళ్లు, తమ వారసత్వం అని పాకులాడే సదరు జీరోలు సారీ ఈ హీరోలకు ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న వేళ సాయం చేయాలనే తలంపు మనస్సులో ఎందుకు మెదలదని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కానీ ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్న సమయంలో.. బాధితుల బాధ అరణ్య రోదన అవుతున్న వేళ.. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలు.. ఆర్థిక సహాయం చేసే స్తోమత లేక.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టే వేళ.. సోనూసూదు లాంటి వాళ్లు.. దైవం మానుష రూపేణ సహాయం అందిస్తారన్నది మాత్రం సుస్పష్టం. అయితే కనీసం స్పందించడం జీవ లక్షణం.. ప్రతి స్పందించడం మనిషి లక్షణం. కానీ మానవత్వం చాటుకునే వేళ ప్రతి స్పందించాల్సిన సదరు సోకాల్డ్ ఈ టాలీవుడ్ హీరోలు ఆ పని చేయకుండా స్తబ్దతగా ఉండిపోతున్నారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టే మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు.. నూటికో కోటికో.. ఒక్కడే ఒక్కడు.. అని మహాకవి డాక్టర్ అందేశ్రీ ఈ పాటను రాసి ఉంటారు.

కొవిడ్ పేరుతో మళ్లీ ఆంక్షలు.. ? కేసీఆర్ వ్యూహం అదేనా? 

ఒకప్పుడు శాసన మండలిలో కొణిజేటి రోశయ్య వంటి సీనియర్ సభ్యులను ఎదుర్కోవడం కష్టమనిపించి, ఆప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏకంగా శాసన మండలిని  రద్దు చేశారని అంటారు. అందులో నిజం వుందో లేదో ఏమో కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా, సమయ సందర్భాలను బట్టి రాజకీయ వర్గాల్లో ఆ ప్రస్తావన అయితే వస్తూనే ఉంటుంది. అలాగే, ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ఉద్యమస్పూర్తిని వదిలి,అధికార పార్టీగా అవతరించిన తెరాస ప్రభుత్వానికి ధర్నా చౌక్ పెద్ద తలనొప్పిగా భావించింది. సర్కార్ తప్పటడుగులను, ఉద్యమ సంఘాలు ఎత్తి చూపేందుకు ధర్నాచౌక్ ‘ను వేదిక చేసుకోవడంతో, ప్రభుత్వం నగరం నడిబొట్టున  ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్’ను ఎత్తుకుపోయి, ఊరవతల పారేసింది.  అయితే న్యాయస్థానం తీర్పుతో ధర్నాచౌక్’ మళ్ళీ  యధాస్థానం గచ్చామి అన్నట్లు ఇందిరా పార్క్’కు   చేరింది. చివరకు, అధికార తెరాస కూడా, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా, అదే ధర్నాచౌక్ వద్ద, మహాధర్నా నిర్వహించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళూ వీళ్ళూ అనేముంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అప్పటికే, కోర్టు ఆదేశాలతో  ధర్నాచౌక్’  వద్ద ప్రజా సంఘాల ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమలు సాగుతున్నా, స్వయంగా ముఖ్యమంత్రే ధర్నాల్లో కూర్చోవడంతో ధర్నాచౌక్’ కు మళ్ళీ పుర్వవైభవ స్థితి వచ్చినట్లు అయింది.  ముఖ్యంగా రేవత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత దూకుడు పెంచారు. తెరాస ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ధర్నాలు, ఆందోళనలు చేసి ప్రభుత్వనికి కంటి మీద కునుకు లేకుండ చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా  వరసగా రెండు రోజులు  రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌’తో ధర్నచౌక్ వద్ద చేపట్టిన  ‘వరి దీక్ష’  సర్కార్’ను బాగా చికాకుకు గురిచేసిందని అంటున్నారు. ఓ వంక కాంగ్రెస్ నాయకులు వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బండారాన్ని బయట పెడుతుంటే, మరో వంక జనంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రమాద స్థాయికి చేరిందని వేగుల అందిస్తున్న సమాచారం అధికార పార్టీ నాయకులక్ను ఆందోళనకు గురిచేస్తోంది.  ధర్నాచౌక్ ఆందోళనలే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలులో జరుగతున్న జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు జరుగుతున్న నష్టానికి వ్యతిరేకంగా జరుగతున్నఆందోళనలు ప్రభుత్వానికి ఓ వంక తలవంపులు, మరో వనక తల నొప్పులు తెస్తున్నాయి.అందుకే, ఏదో ఒక వంకన రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలని కొంత కాలంపాటు కట్టడిచేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం జరుగుతోంది.. ఈ సమావేశంలో, ప్రదానంగా ధాన్యం కొనుగోలు, మరో మారు ప్రపంచాన్ని కలవార పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్’ కట్టడి చర్యల పై ప్రధానంగా చర్చ జరుగుతుందని అంటున్నారు. అయితే,  ఓమిక్రాన్’కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికల నేపధ్యంలో, ఇతర సాముహిక కార్యకలాపాలతో పాటుగా  రాజకీయ కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పూర్తిగా కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కట్టడికోసం మాత్రమే కాకుండా, రాజకీయ వ్యతిరేకత కట్టడిచేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

తొలి టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ.. తొలి భారతీయుడిగా శ్రేయస్ రికార్డ్ 

టెస్టుల్లో టీమిండియా తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం, రెండో ఇన్నింగ్స్ లో అర్ధశతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇలాంటి ఫీట్ సాధించిన అంతర్జాతీయంగా పదో ఆటగాడిగా శ్రేయర్ అయ్యర్ నిలిచారు.  న్యూజిలాండ్ తో కాన్పూరులో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 105, రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇంతకుముందు 1933-34 సీజన్ లో దిలావర్‌ హుస్సేన్‌ (59, 57), 1970-71 సీజన్ లో విండీస్ మీద సునిల్ గవాస్కర్ (65,67*) లు ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధశతకాలు సాధించారు. అయితే వీరిద్దరి కన్నా శ్రేయస్ మెరుగ్గా రాణించాడు. కివీస్ తో రెండో ఇన్నింగ్స్ లోనూ శతకం సాధిస్తాడని భావించినా సౌథీ బౌలింగ్ లో బంతి గ్లౌజ్ కు తాకి కీపర్‌ చేతిలో పడింది. దీంతో హాఫ్ సెంచరీతోనే పెవిలియన్ చేరాడు శ్రేయస్ అయ్యర్.  కాన్పూరు టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సాధించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. అయ్యర్ కంటే ముందు వరుసలో శిఖర్‌ ధావన్.  రోహిత్ శర్మ ఉన్నారు.   శిఖర్ ధావన్ తన తొలి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ పై తొలి ఇన్నింగ్స్ లో 187 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతనికి  బ్యాటింగ్ చేయలేదు. అయినా తొలి మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్ గా శిఖర్ నిలిచారు. ఇక రోహిత్ శర్మ  2013-14 సీజన్ లో విండీస్ పై ఆడిన తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 177 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ కు కూడా  బ్యాటింగ్ రాలేదు. శ్రేయస్ అయ్యర్ మాత్రం రెండు ఇన్నింగ్సుల్లోనూ బ్యాటింగ్ చేసి మొత్తం 170 పరుగులు చేశాడు. 

ఢిల్లీలో పోరాటం.. అమరావతికి జై.. కేసీఆర్ నాటకమేంటీ.. మళ్లీ ఆంక్షలేనా.. టాప్ న్యూస్@7PM

పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల హాజరైనారు. విశాఖ స్టీల్స్‌, ఇతరసంస్థల ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. రాజధానుల విషయంలో అనిశ్చితి తొలగించి... అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలన్నారు. వరదల ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించకుండా.. కేవలం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు ------ ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు  లాల్ సింగ్ ఆర్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసిన అమరావతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్‌‌ని ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అయితే.. అంబేద్కర్‌కి భారతరత్న అవార్డు రావడానికి ఎంతో కృషి చేశామన్నారు.  -- ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఏపీ జేఏసీ అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ వెల్లడించనున్నాయి. ఉద్యమం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీలో కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ----- కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో రైల్వేకోడూరు- తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఊటుకూరు చెరుకు గండి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో గండిపడిన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ------ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ బాణీని గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఓపికపట్టామని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్దేశించారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రం వైఖరిపై నిలదీయాలని స్పష్టం చేశారు ---- టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర లేపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.  వరి దీక్షలో మాట్లాడుతూ ఢిల్లీ కెళ్లిన కేసీఆర్..సురేష్‌రెడ్డి ఇంట్లో విందుభోజనం చేసి వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీని కలవలేదని, అపాయింట్‌మెంట్ అడగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరి మీద అవగాహన లేని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారు? అని రేవంత్‌ప్రశ్నించారు. ------ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రైతుకు పట్టిన పెద్ద చీడగా మారారన్నారు. ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి భరతం పట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ----- కొత్త కొవిడ్ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరింతగా పునఃసమీక్ష జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ప్రధాని ముఖ్య శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, వైద్య ఆరోగ్య, పౌర విమానయాన శాఖల ఉన్నతాధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు. ----- కాన్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింకా రహానే సాహసం చేశారు. తాత్కాలిక కెప్టెన్ గానే ఉన్నా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూజీలాండ్ కు కేవలం 284 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చి.. భారత సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇంకా ఒక రోజు ఆట మొత్తం ఉన్న సమయంలో 284 పరుగుల టార్గెట్ ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పెద్ద సాహసమే అంటున్నారు.  -- టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించి రికార్డు సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌ మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయంగా పదో ఆటగాడు కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు

కివీస్ టెస్టులో రహానే సాహసం.. బౌలర్లపైనే టీమిండియా ఆశలు.. 

కాన్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింకా రహానే సాహసం చేశారు. తాత్కాలిక కెప్టెన్ గానే ఉన్నా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూజీలాండ్ కు కేవలం 284 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చి.. భారత సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇంకా ఒక రోజు ఆట మొత్తం ఉన్న సమయంలో 284 పరుగుల టార్గెట్ ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పెద్ద సాహసమే. అయినా విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా భారత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అందరికి  ఆశ్చర్యపరిచాడు అజింకా రహానే.  తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. రహానే ఆశలను నిజం చేస్తూ రెండో ఓవర్ లోనే వికెట్ తీశాడు అశ్విన్.  నాలుగరోజు ఆట ముగిసే సమయానికి న్యూజీలాండ్ జట్టు వికెట్ నష్టపోయి నాలుగు పరుగులు చేసింది. అంటే చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉండగా.. కివీస్ విజయానికి 280 పరుగులు కావాలి. భారత్ కు మాత్రం గెలుపు కోసం తొమ్మిది వికెట్లు కావాలి. భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది.  కాన్పూర్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్ 17 ,  పుజారా  22 పరుగులతో ఇన్నింగ్స్ బాగానే ఆరంభించినా జేమీసన్  వీరిని విడదీశాడు. ఓ షార్ట్ పిచ్ బంతితో పుజారాను బుట్టలో వేసుకోవడంతో న్యూజిలాండ్ వికెట్ల వేట ప్రారంభించింది. అనంతరం కెప్టెన్ రహానె (4)ను అజాజ్  పటేల్ ఔట్ చేయగా.. టిమ్ సౌథీ ఒకే ఓవర్ లో మయాంక,  రవీంద్ర జడేజాను పెవిలియన్‌ పంపాడు. దీంతో భారత్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శ్రేయస్‌, అశ్విన్ ఆరో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. అశ్విన్ అవుటయ్యాకా అక్షర్ పటేల్ తో కలిసి ఏడో వికెట్ కు 50 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్.. తర్వాత అవుటయ్యారు. కాసేపు ఆజిన తర్వాత 234 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు రహానే. 

బోలేడు సమస్యలున్నా పోరాటమేది? టీటీడీపీ ఉన్నట్టా.. లేనట్టా?

తెలంగాణలో ప్రస్తుతం అన్ని సమస్యలే. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలన్ని దూకుడు పెంచాయి. కేసీఆర్ టార్గెట్ చేస్తూ వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలు తిరిగి వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాంగ్రెస్ కూడా నిరుద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమించింది. వరి అంశంపై జోరుగా జనంలోకి వెళుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఉద్యమాలు చేస్తూ కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు. వామపక్షాలు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్నాయి.  తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండగా.. మరో విపక్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నా ఎక్కడా తెలంగాణ తమ్ముళ్లు స్పందించడం లేదు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తరుచూ సమస్యలపై స్పందించేవారు. కొన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ సర్కార్ ను నిలదీసేవారు. ఎల్ రమణ టీడీపీని వీడి కారెక్కడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. ఆ ప్రభావం ప్రస్తుతం కనిపిస్తుందని అంటున్నారు. ఎల్ రమణ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, దళిత నేత బక్కని నర్సింహులును అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. కొత్త కమిటిని కూడా వేశారు. అయితే బక్కని టీమ్ అనుకున్నతంగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు ఉన్నా... టీటీడీపీ ఒక్క పెద్ద కార్యక్రమం నిర్వహించలేదంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. హైదరాబాద్ లోనూ చిన్నపాటి నిరసన కార్యక్రమాలు నిర్వహించలేకపోతోంది. గ్రేటర్ పరిధిలో బలమైన నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నేతలు పార్టీలు మారిన కార్యకర్తలు మాత్రమే అలానే ఉన్నారు. అయితే నడిపించే నాయకుడు లేకపోవడం వల్లే తమ్ముళ్లు రోడ్లపైకి రాలేకపోతున్నారనే అభిప్రాయ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫైర్ బ్రాండ్ లీడర్లు వస్తే టీడీపీ కేడర్ సత్తా చూపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి నేతలు లేకపోవడంతో బయటికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ చేసే అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకకపోవచ్చని అంటున్నారు. 

కాంగ్రెస్ కు తృణమూల్ మరో ఝలక్ .. రాహుల్ టార్గెట్ గా పీకే స్కెచ్

జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పడగొట్టి ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కమలదళం కలలుకన్న కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్య సాధనకు, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నడుం బిగించారా? అంటే  రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.  పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వయంగా తానే రాజకీయ చక్రం తిప్పాలని ఆశించారు. అందుకోసం  ప్రయత్నించారు. అయితే, ఎందుకనో  ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఇక అక్కడి నుంచి ఆయన మళ్ళీ మరోసారి మమతతో జట్టు కట్టి, కాంగ్రెస్ మీద కక్షకట్టారా అన్నట్లుగా, రాష్ట్రాలవారీగా, కాంగ్రెస్ జెండాను పీకేసీ ఆ స్థానంలో తృణమూల్ జెండాను ఎగరేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్ర్లపై కన్నేసిన పీకే, కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొందరు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ గూటికి చేరుతున్నారు.  ఇప్పటికే మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్‌హో ఫ‌లేరో, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇంకా ఇతర కీలక నేతలు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు.  అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించే ఆలోచనకు అంకురార్పణ అన్నట్లుగా మేఘాలయలో ప్రతిపక్షపీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానాన్ని తృణమూల్ ఆక్రమించుకుంది. గమ్మత్తు ఏమంటే, రెండేళ్ళ క్రితం జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీనే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తృణమూల్, వృద్ధ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంత చేసుకుంది.మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో తృణమూల్ జెండాని ఇప్పటికే నిలబెట్టారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యన్మాయంగా తృణమూల్ సారధ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలో కూటమిని ఏర్పటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధనే భావన తుడిచేసేందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని నైతికంగా బలహీన పరిచే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు.  ఇదే క్రమమలో తృణమూల్ కాంగ్రెస్ తాజాగా వృద్ధ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చింది. పార్లమెంట్’లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. సోమవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఏర్పాటు చేసిన సమావేశానికి తృణమూల్ హాజరు కాదని ఆ పార్టీ నాయకులు  స్పష్టం చేశారు. విపక్షాల సమావేశానికి రావాలని  రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తృణమూల్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ సారధ్యంలో జరిగే విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీని తృణమూల్ నేత అవహేళన చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే సరైన సయోధ్యత లేదని,ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు . మరో వంక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి సమావేశం జరుగతున్న సమయంలోనే,  మమతా బెనర్జీ ఢిల్లీ నివాసంలో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ అదిపత్య పోరు, చివరకు బీజేపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని, అలాగే, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రయత్నం ఫలిస్తే, కాంగ్రెస్ కనుమరుగైపోయినా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.  

బాబు లేఖాస్త్రం.. సోనూ సాయం.. బుక్కైన వైసీపీ నేత.. రేవంత్ గర్జన.. టాప్ న్యూస్@1PM

ఏపీ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. వ‌ర‌ద‌ల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై న్యాయ విచార‌ణ‌కు డిమాండ్  చేశారు. ప్ర‌భుత్వ అంచ‌నా మేర‌కు రూ.6,054 కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికి కేవ‌లం రూ.35 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల నిధులు మ‌ళ్లించిన‌ట్లు కాగ్ త‌ప్పుబ‌ట్టింద‌ని బాబు చెప్పారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు. --- నెల్లూరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తూ సినీ నటుడు సొనూసూద్ మరోసారి ఉదారతను చాటుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకోవ‌డం కోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ తరఫున  బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారు. బాధితుల‌కు బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు వంటి నిత్యవసరాల‌తో కూడిన కిట్ల‌ను పంపారు.  ----- గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్యే ఆర్కే. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆర్కే ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 2 ------ తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేస్తుంటే కేసులు నమోదుచేసి వేధిస్తున్నారని ఆరోపించారు. భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సీపట్నంలో జరిగిన ఆందోళనలో తాను పాల్గొంటే పోలీసులు తనపట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు ------- తెలంగాణ కాంగ్రెస్ ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వర్షా కాలం ధాన్యం కొనకుండా.. యాసంగి పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రైతులు రాళ్లతో కొడతారన్నారు. ధైర్యముంటే సీఎం కేసీఆర్, హరీష్‌రావు, బండి సంజయ్, కిషన్‌రెడ్డి కల్లాల దగ్గరకు రావాలన్నారు. -------- చిత్తూరు జిల్లాలో వరుస భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. పలమనేరు మండలం, కరడిమడుగులో అర్ధరాత్రి భారీ శబ్దంతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్డుపై బిక్కు బిక్కుమంటూ గడిపారు. అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు ----- భారీగా అక్రమ మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా అనంతవరం చెక్‌పోస్ట్ దగ్గర డీటీఎఫ్‌ అధికారులు 480 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీ, అధికారుల అండదండలతో వైసీపీ నేత కోడె శ్రీను.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. కోడె శ్రీను అక్రమ రవాణాకు అనంతవరం చెక్‌పోస్ట్ సిబ్బంది సైతం సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది. --- హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నమైంది. కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాల ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో  పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు. --- హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద  కారు బీభత్సం సృష్టించింది . అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి  హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది .దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది . అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద దవాఖానకు తరలించారు. --- దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేసి అమలు చేస్తున్నారు. అలాగే, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

6 వేల కోట్ల నష్టం జరిగితే 35 కోట్లు ఇస్తారా.. జగన్ పై చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గినా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా వరదల్లోనే ఉన్నాయి. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వ‌ర‌ద‌ల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై న్యాయ విచార‌ణ‌కు చంద్ర‌బాబు డిమాండ్  చేశారు. ప్ర‌భుత్వ అంచ‌నా మేర‌కు రూ.6,054 కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికి కేవ‌లం రూ.35 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని చంద్రబాబు అన్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల నిధులు మ‌ళ్లించిన‌ట్లు కాగ్ త‌ప్పుబ‌ట్టింద‌ని చంద్రబాబు చెప్పారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు. ఏపీలో వరదల వ‌ల్ల‌ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు న‌ష్ట‌పోయార‌ని ఆయ‌న అన్నారు.ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందించాల‌ని చంద్రబాబు కోరారు. న‌ష్ట‌పోయిన‌ ప్రతి ఒక్కరికి సాయం అందాల్సి ఉంద‌ని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాల‌ని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సాయం అందించాల‌ని చెప్పారు.  పంట నష్ట పరిహారాన్ని పెంచాలని కోరారు.

దళిత బంధు లేదు.. విపక్షాలు ప్రశ్నించవు! కేసీఆర్ కోరుకున్నదే జరుగుతోందా?

తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత దూకుడుగా విపక్షాలు పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ పాలిటిక్స్ చేస్తోంది. అధికార పార్టీగా ఉండి కూడా  ప్రతిపక్షాలకు పోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ప్రగతి భవన్ , ఫామ్ హౌజ్ నుంచి బయటికి రారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ సైతం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు వచ్చారు. ఏకంగా ధర్నాలో పాల్గొన్నారు. దీంతో విపక్షాల ట్రాప్ కేసీఆర్ పడ్డారని కొందరు వాదిస్తుండగా.. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆరే తన ఎత్తులతో విపక్షాలను తన ఉచ్చులో పడేశారనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. దళిత బంధు పథకాన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహంలో విపక్షాలు చిక్కుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  దళిత బంధు... హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త పథకం. దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించే స్కీమ్ అది. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టిన ప్రభుత్వం.. ఆ నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలను ఎంపిక చేసింది. వాళ్ల అకౌంట్లలో 10 లక్షల రూపాయల జమ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పేరుతో డ్రామా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లు ఉండటంతో.. వాళ్ల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకే ఈ స్కీమ్ తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం దళిత బంధు హుజురాబాద్ కే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలను ఉన్నాయని.. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాదు దళిత ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా  కొన్ని రోజుల పాటు దళిత బంధు అమలును ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో ఎన్నికల సంఘంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం నవంబర్ 4వరకు మాత్రమే పథకాన్ని ఆపగలదని, తర్వాత దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ బ్రేకులు వేస్తారని సవాల్ చేశారు. నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేస్తామని తెలిపారు. హుజురాబాద్ తో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితులందరికి 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే నవంబర్ 4వ తారీఖు ముగిసి నాలుగు వారాలు కావొస్తొంది. కాని దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్ సర్కార్. నవంబర్ 4 తర్వాత పథకం అమలు కాకుండా ఎవరూ ఆపుతారే చూస్తానంటూ ప్రకటనలు చేసిన కేసీఆరే.. స్కీమ్ ను పట్టించుకోవడం మానేశారు. రోజులు గడుస్తున్నా దళిత బంధుపై ముందడుగు పడకపోవడంతో దళితులు ఆగ్రహంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించదనే విమర్శలు వస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన అంశంపై విపక్షాలు సైలెంటుగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. విపక్షాలను దళిత బంధు నుంచి సీఎం కేసీఆరే సైడ్ ట్రాక్ చేశారని అంటున్నారు. ్ందుకే వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారని, విపక్షాలు కూడా అన్న వదిలేసి వరి ధాన్యం కేంద్రంగానే ఉద్యమం చేస్తున్నాయని చెబుతున్నారు. అలా దళిత బంధు గురించి విపక్షాలు మాట్లాడకుండా కేసీఆర్ తనదైన శైలిలో సైడ్ చేశారని అంటున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వరిని కేంద్రమే కొంటుంది. కాని ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నగా మారింది. యాసంగిలో ఎంత పంట కొంటామన్న విషయాన్ని కేంద్రం ఎప్పుడైనా డిసెంబర్ లోనే చెబుతుంది. కాని కేసీఆర్ మాత్రం తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందనే వాదన తెచ్చారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందనే కవరింగ్ ఇచ్చారు. వరి కొనుగోలు చేయబోమంటూ కేసీఆర్ ప్రకటించడం... అదే పట్టుకుని విపక్షాలు రోడ్డెక్కడం జరిగిపోయాయి. దీంతో దళిత బంధు అంశం మరుగున పడిపోయింది. కేసీఆర్ ప్రకటించిన నవంబర్ 4 వెళ్లి నాలుగు వారాలవుతున్నా.. దాని గురించి ప్రశ్నించేవారే లేకుండా పోయారు. కేసీఆర్ కూడా ఇదే కోరుకున్నారని, అంతా ఆయన అనుకున్నట్లే జరిగిపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా తన వ్యూహాలతో విపక్షాలను కేసీఆర్ తన ట్రాప్ పడేశారని, దళిత బంధును అటకెక్కిస్తున్నారని అంటున్నారు. 

హోమో సెక్స్ వల్ రేవ్ పార్టీ! కూకట్ పల్లి పోలీసుల భగ్నం..

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నమైంది. అయితే పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ఇప్పటివరకు కాలేజీ విద్యార్థులు ఎక్కువ రేవ్ పార్టీల్లో పాల్గొంటున్నట్లు బయటపడగా.. తాజాగా పట్టుబడిన వారిలో హోమో సెక్సువల్ ఎక్కువగా ఉండటం సంచలనంగా మారింది. కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాల ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు.  యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో  పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు  పోలీసులు. దీంతో హోమో సెక్సువల్స్ ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించుకుంటాన్నరే విషయం కూకల్ పల్లి పార్టీతో బయటపడిందని అంటున్నారు. ఈ పార్టీపై మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్.. అడ్డంగా బుక్కైన పైసా నికాల్ బ్యాచ్ పోలీసులు..

పల్లెపల్లెకు పసుపు దండు.. డిసెంబర్ లో  గౌరవ సభలు

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి కార్యచరణ ప్రకటించింది ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ. డిసెంబర్ 1 నుంచి పల్లెపల్లెకు వెళ్లనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు డిమాండ్స్ తో కూడిన ఎజెండాను సిద్ధం చేసింది.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అసభ్య పదజాలంపై జనంలోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.  మొత్తం 17 అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది టీడీపీ. అధికార వైసీపీని గద్దెదించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు విశ్రమించకుండా పోరాటం సాగించాలని పొలిటిబ్యూరో సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. చట్టాలు చేయాల్సిన గౌరవ సభ .. జగన్ రెడ్డి అధ్యక్షతన కౌర సభగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా మహిళల వ్యక్తిత్వంపై ఏవిధంగా దాడి చేశారో ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగం డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించింది పొలిట్ బ్యూరో సమావేశం. సామాజంలో ఆడపడుచుల గౌరవంపై విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని పార్టీ భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పై అధికార పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వం హననం పై చంద్రబాబు భావోద్వేగానికి లోనై,తిరిగి ముఖ్యమంత్రి అయిన తరువాతే మళ్లీ అసెంబ్లీ అడుగుపెడుతానని శపథం చేశారు. చంద్రబాబు శపథంపై పొలిట్ బ్యూరో సభ్యులు ఏకగ్రీవంగా మద్దతును ప్రకటించారు. పార్టీ నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబు అసెంబ్లీ శపథంపై కట్టుబడి ఉందని సభ్యులు పేర్కొన్నారు. దీనిబట్టిచూస్తే.. అందుకు తగిన విధంగా గ్రాస్ రూట్ లో పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాయలసీమలో సంభవించిన వరదలు, మరణాలపై న్యాయ విచారణ డిమాండ్ తోపాటు వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25 నష్టపరిహారం చెల్లించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ సీరియస్ వ్యాఖ్యలు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం వంటి వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాని, బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, పంచాయితీ నిధులను వెంటనే జమచేయాలని ఇలా పలు అంశాలతో కూడిన డిమాండ్స్ ను ఎజెండాగా సభ్యులు రూపొందించారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చైనా సరే.. ప్రజలకు మేలు జరిగేలా చూడాలని అధినేత చంద్రబాబు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 

ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్.. అడ్డంగా బుక్కైన పైసా నికాల్ బ్యాచ్ పోలీసులు

అతనో ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తుంటారు. ఆయనకు ఓ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆయన దృష్టికి వచ్చాయి. కొందరు ట్రక్కు డ్రైవర్లు పోలీసుల అక్రమాలపై ఎమ్మెల్యేను కలిసి వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో అక్రమ వసూళ్ల సంగతి చూడాలని ఎమ్మెల్యే డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి పూట స్టింగ్ ఆపరేషన చేశారు.  మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం ఘాట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నది ఆ ఆరోపణ. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యే మంగేష్ చహ్వాణ్‌కు తెలియడంతో ఆయన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్ గా మారింది.  ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ వీడియోలో.. ముందుగా ఎమ్మెల్యే కొందరు డ్రైవర్లతో మాట్లాడటం కనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేతో.. తమ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా రూ. 500 నుంచి రూ. 2000 వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. వీరి మాటలు విన్న ఎమ్మెల్యే ఒక ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని చెక్‌పోస్టు వరకూ వచ్చారు. అక్కడున్న ఒక కానిస్టేబుల్.. ఎమ్మెల్యే ఎక్కిన ట్రక్కును ఆపాడు. కిందకు దిగి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఎమ్మెల్యే తన దగ్గర రూ. 300 మాత్రమే ఉన్నాయని వాటిని ఇస్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో మరోకానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అతను ఎమ్మల్యేను దుర్బాషలాడాడు. దీంతో ఎమ్మెల్యే వాహనం నుంచి దిగారు. అతనిని గుర్తించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు.  ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్ సమాచారం అందుకున్న ఔరంగాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లందరినీ విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగేష్ మాట్లాడుతూ తాను అక్రమాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నానని, ఇక్కడి అధికార ఫ్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంతటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇప్పుడు బయటపడిందన్నారు. ఎమ్మెల్యే మంగేష్ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్సాప్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.