రోజుకు రూ. 5 కోట్ల నష్టం.. హైదరాబాద్ మెట్రో మూతపడనుందా?
posted on Nov 24, 2021 @ 6:52PM
హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మీనార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ గుర్తుకు వచ్చేవి. తర్వాత ఆ జాబితాలో సైబర్ టవర్స్ చేరింది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే లిస్టులో మెట్రో రైలు కూడా చేరింది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు చెక్ పెడుతూ మూడు కారిడార్లలో పరుగులు పెడుతుంది ఎల్ఎండ్ సంస్థ నిర్మించిన హైదరాబాద్ మెట్రో. అత్యాధునిక హంగులతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచిన మెట్రో.. కొన్ని రోజుల్లోనే నగరవాసుల మనసు దోచుకుంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యం చేర్చింది.
అయితే సాఫీగా సాగుతున్న హైదరాబాద్ మెట్రోకు కరోనా మహమ్మారి గండంగా మారింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది మెట్రో రైళ్ల పైనే. కొవిడ్ కారణంగా ఎక్కువ రోజులు షట్ డౌన్ అయింది మెట్రో రైళ్లే. ఫస్ట్ వేవ్ లో దాదాపు రెండు నెలల పాటు మెట్రో మూత పడింది. సెకండ్ వేవ్ లో అయితే దాదాపు మూడు నెలల పాటు రైళ్లు పట్టాలెక్కలేదు. తర్వాత రైళ్లను నడుపుతున్నా.. జనాలు మాత్రం ముందులా ఎక్కడం లేదు. మెట్రో పూర్తిగా ఏసీమయం. దీంతో ఏసీతో వైరస్ ఈజీగా వ్యాప్తి చెందుతున్న భయంతో జనాలు ప్రయాణించేందుకు జంకారు. ఇప్పటికే మెట్రో ఎక్కేందుకు జనాలు భయపడిపోతున్నారు. అందుకే ఒకప్పుడు ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన మెట్రో రైళ్లు.. ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. మెట్రో ప్రయాణికులు తగ్గడమే కాదు.. మెట్రో సంస్థ నిర్వహిచే మాల్స్ , షాపింగ్ సెంటర్లలో కూడా బిజినెస్ తగ్గిపోయింది. దీంతో మెట్రోకు భారీగా నష్టాలు వస్తున్నాయి.
ఎల్ అండ్ టీ మెట్రోకు ప్రస్తుతం రోజుకు 5 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డినే అధికారికంగా తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు వస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మెట్రో ఆర్థిక ఇబ్బందులను వివరించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అండగా ఉండాలని కోరామన్నారు. మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారని ముఖ్యమంత్రి చెప్పారని... కాని ఆరు వారాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపంచడంలేదన్నారు కేవీబీ రెడ్డి.
మెట్రోకు రోజుకు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, గత త్రైమాసికంలో మెట్రోకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లేదంటే రైళ్లను నడిపే పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. మెట్రోను కాపాడుకోవాలంటే తెలంగాణ సర్కార్ వెంటనే సాయం ప్రకటించాలని కేవీబీ రెడ్డి అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.