ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఖర్చులకు చందాలిచ్చిన ఉద్యోగులు.. ఏపీలో విడ్డూరం..
posted on Nov 25, 2021 @ 10:10AM
ఆంధ్రప్రదేశ్ లో అంతా విచిత్రమే. జగన్ రెడ్డి పాలనంతా అంతా రివర్స్ అన్న టాక్ ఇప్పటికే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉంటున్నాయి. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ప్రజా ప్రతినిధుల తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజప్రతినిధిగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి ఏదైనా కార్యక్రమం చేస్తే.. ఆయన వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి ప్రసంగాలు చేసి వెళ్లిపోతారట. కానీ కార్యక్రమానికి చేసిన ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోరట. దానికయ్యే ఖర్చులు మాత్రం అధికారులే భరించాలట. ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులే.. చివరికి డబ్బులు కూడా భరించాల్సి రావడం విచిత్రంగా ఉంది కదూ..
గత నెలలో వైఎస్సార్ ఆసరాచెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీరాలలోని మండల పరిషత్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చి.. మాట్లాడి వెళ్లిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. కార్యక్రమం ముగిశాకా షామియానా సిబ్బంది డబ్బుల కోసం క్యూ కట్టారు. కానీ ఎవరూ స్పందించలేదు. వాస్తవానికి ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఈ కార్యక్రమానికి కూడా సంబంధిత శాఖ జిల్లా అధికారులు నిధులు పంపారు. కానీ షామియానా సిబ్బందికి ఒక్కరూపాయి ఇవ్వలేదు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
షామియానా డబ్బుల ఇవ్వకపోతే పరువు పోతుందనే భయంతో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది చందాలు వసూల్ చేశారట, వీఏవోలు, వెలుగు సిబ్బంది నుంచి డబ్బులు వసూల్ చేసి షామియానా ఖర్చులు చెల్లించారట. అయితే వెలుగు సిబ్బంది తమకు వచ్చేదే అరకొర అయ్యా మాకు వచ్చేది అరకొర వేతనాలే.. ఖర్చులు పెరిగిపోయాయి.. ఇలా వెయ్యంటే.. ఎలా అని ప్రశ్నించారట. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఎంపీడీవో.. ఖస్సు మన్నారట.. మీరు వెయ్యే ఇచ్చారు.. నా చేతి చమురు ఇంకా ఎక్కువే వదిలింది ఆయన రుసరుసలాడారట. మొత్తంగా చూస్తే.. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు.. కరణంగారి కార్యక్రమం.. చిరుద్యోగుల చేతి చమురును వదిలించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.