ఏపీని వీడని వాన గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల వార్నింగ్
posted on Nov 25, 2021 9:15AM
కుండపోత వానలు, భారీ వరదలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు వరుణ గండం వీడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇటీవలే కుండపోత వానలతో అతలాకుతలం అయిన రాయలసీమతో పాటు కోస్తాలో అతివృష్టి కురిసే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశముందని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకుంటుందని పేర్కొంది. వీటి ప్రభావంతో బుధవారం రాయలసీమ, దక్షిణకోస్తాలో అక్కడక్కడ మోస్తరు వానలు, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.
రానున్న 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.