డ్రైనేజీ పైప్ లైన్ లో నోట్ల కట్టలు.. అవినితీ అధికారి బండారం బయటపెట్టిన ఏసీబీ
posted on Nov 25, 2021 8:08AM
ఇంటి బయట ఉన్న డ్రైనేజీ పైపులో నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు పడటం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే ఇలా డ్రైనేజీ పైపు నుంచి డబ్బుల కట్టలు, నగలు పడిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా లక్ష్మీ దేవిలా భావించి పవిత్రంగా దాచుకుంటారు. కష్టపడకుండా వచ్చిన అవినీతి సొమ్మును సొమ్ములాగే చూస్తారు కానీ లక్ష్మీ దేవిలా చూడరని నిరూపించాడు ఓ అవినీతిపరుడు. అందుకే అప్పనంగా వచ్చిన అవినీతి ధనాన్ని డ్రైనేజీ పైపులో దాచిపెట్టాడు ఓ అవినీతిపరుడు. కర్ణాటకలోని కాలబుర్గిలో బుధవారం జరిగిని అవినీతి నిరోధక శాఖ సోదాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. కర్ణాటక ఈశాన్య రేంజ్ ఏసీబీ ఎస్పీ మహేష్ మేఘన్ననవర్ ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు.
కలబుర్గి ప్రాంతానికి చెందిన శాంత గౌడ బిరాదర్ అనే వ్యక్తి.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటులో జాయింట్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలోనే డ్రైనేజీ పైపులో కట్టలు కట్టల డబ్బులు బయటపడ్డాయి. ఆ పైపులో డబ్బు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఒక ప్లంబర్‌ను పిలిపించి పైపులోని డబ్బును బయటకు తీశారు. ఈ పైపులో రూ.25 లక్షల నగదు, బంగారం దొరికినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఏసీబీ ఎస్పీ మహేష్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శాంత గౌడ్ ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన సోదాల్లో రూ. 54 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. కమిషన్ల కోసం కక్కుర్తిపడే శాంత గౌడ్ వేధింపులు తాళలేకపోయిన సివిల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఇల్లు, సమీప బంధువుల నివాసాలపై ఆకస్మిక దాడులు జరిపి సోదాలు చేపట్టారు.
కేజీఎఫ్' బాబు.. పాత సామాన్లతో 1,740 కోట్లు.. ఎమ్మెల్సీ బరిలో..
ఏసీబీ అధికారులు సోదాల కోసం వచ్చి తలుపులు కొడుతున్నప్పటికీ.. శాంత గౌడ్ అతడి కొడుకు మాత్రం 15 నిమిషాల పాటు తలుపులు తీయకుండా లోపల ఉన్న ధనాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. వాషింగ్ బేషన్ నుంచి వెళ్లే డ్రైనేజ్ పైపులో వాళ్లు కుక్కిన రూ. 13 లక్షల నోట్ల కట్టలను ఏసీబీ అధికారులు తవ్వితీశారు. ఇంటిపై కప్పు సీలింగ్‌లోనూ నోట్ల కట్టలు దాచిపెట్టినట్టు సందేహించిన అధికారులు సీలింగ్ పగలగొట్టి అందులోంచి 6 లక్షల రూపాయలు వెలికితీశారు.