డీజే మ్యూజిక్.. 63 కోళ్లు ఫసక్.. పోలీసులకు కంప్లైంట్..
posted on Nov 24, 2021 @ 5:35PM
ధూంధాంగా పెళ్లి. రాత్రికి ఊరేగింపు. వారంతా ఫుల్‌గా తాగున్నారు. పెద్ద సౌండ్‌తో డీజే పెట్టారు. డ్యాన్సులతో జోష్ మీదున్నారు. మధ్య మధ్యలో టపాసులు పేల్చారు. రాకెట్లు, బాంబులతో సంబరాలు చేసుకున్నారు. అర్థరాత్రంగా హంగామా చేశారు. కట్ చేస్తే.. ఆ డీజే సౌండ్‌కు, టపాసుల మోతకు ఆ పక్కనే ఉన్న కోళ్ల ఫామ్‌లో 63 బ్రాయిలర్ కోళ్లు చనిపోయాయి. ఆ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాకీలు పిలిపించి అడిగితే తమకేం సంబంధం లేదన్నారు పెళ్లి వారు. కోళ్ల ఫాం యజమాని మాత్రం డీజే వల్లే తన కోళ్లు చనిపోయాయని కేసు పెట్టాడు.
రంజిత్‌కు చెందిన కోళ్ల ఫాంలో 2వేల వరకూ కోళ్లు ఉన్నాయి. కోళ్ల ఫాం ముందున్న రోడ్డుపై పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెద్ద సౌండ్‌తో డీజే పెట్టడంతో.. ఆ శబ్దాలకు కోళ్లు తట్టుకోలేకపోయాయి. బాధతో కూత పెట్టాయి. అది చూసి.. రంజిత్ కాస్త సౌండ్ తగ్గించమంటూ పెళ్లి వారిని వేడుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న వారంతా.. రంజిత్‌ను తిట్టి, బెదిరించి వెళ్లగొట్టారు. ఇదంతా మిడ్‌నైట్ జరిగింది.
తెల్లారి చూసే సరికి.. 63 కోళ్లు చనిపోయి ఉన్నాయి. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా చెప్పి.. పెళ్లి వారి నుంచి నష్ట పరిహారం ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నష్టపరిహారం ఇచ్చేందుకు పెళ్లి బృందం నిరాకరించింది. పోలీసులు వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి.. పెద్ద సౌండ్‌కు కోళ్లు చనిపోతాయా? అని వైద్యుడి ఒపీనియన్ తీసుకున్నారు. తీవ్రమైన శబ్దాలు, బాణాసంచా కారణంగా గుండెపోటుతో ఆ కోళ్లు చనిపోయినట్టు వెటర్నరీ డాక్టర్ ధృవీకరించారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగింది.