పొంగులేటి పయనమెటు ?
అంతా అయిపోయింది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక కండువాలు కప్పుకోవడమే మిగిలుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనవరి 18న ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలోనే, అక్కడ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి, ‘కడువా’ మార్పిడి వేడుకకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరిగింది.
అఫ్కోర్స్, బీజేపీ ముఖ్యనాయకులు ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ చేయక పోయినా, సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే జనవరి 18 వచ్చింది వెళ్ళింది. పొంగులేటి అయన వర్గం సభకు హాజరు కాలేదు కానీ, అనుకున్నవిధంగానే ధూం ..దాంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఆశించినంత కాకపోయినా జన సమీకరణ కూడా భారీగానే జరిగింది. కానీ పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోలేదు. అసలు ఢిల్లీ వెళ్ళనే లేదు. అంతే కాదు, ఆతర్వాత ఆ ఊసే ఎక్కడ వినిపిచడం లేదు.
మరోవంక పొంగులేటి మనసు మార్చుకున్నారని, బీజేపీలో చేరడమా, కాంగ్రస్ లో కలవడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుదనే విషయంలో పొంగులేటికీ కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. భారాసలో ఎదురైన చేదు అనుభావాలే అక్కడా ఎదురవుతాయనే భయంతోనే వెనకడుగు వేశారని అంటున్నారు. అలాగని, కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా ఢోకా ఉండదు. కానీ, ఇంతవరకు వచ్చి వెనకడుగు వేస్తే మోడీ, షా నిముషం ఆలస్యం చేయకుండా ఐటీ, ఈడీ గొలుసులు విప్పుతారనే భయం పొంగులేటిని వెంటాడుతోంది. ఇప్పడు ఈ రెండు భయాల మధ్య ఆయన అటూ ఇటూ ఉగుతున్నారని, అంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటే, బీజేపీ కంటే కాంగ్ర్రేస్ పార్టీ పుష్టిగా, పటిష్టంగా వుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మంచి పట్టుంది. గట్టి నాయకులున్నారు. కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ వుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్క భట్టి మినహా మిగిలిన వారంతా కట్టకట్టుకుని భారాసలోకి దూకేశారు. సో..పొంగులేటి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోగలుగుతారు. అఫ్కోర్స్ టిక్కెట్ల వరకు బీజేపీలో అయితే అసలు ఆ మాత్రం సమస్య కూడా లేదు. కానీ జిల్లాలో బీజేపీకి కనీస ఉనికి లేదు. లీడర్లు లేరు.. క్యాడర్ లేరు. సో రాజకీయ లెక్కలు బేరీజు వేసుకుంటే, కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమం.
నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి. తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారని అంటున్నారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని, అయితే, ఢిల్లీలో కాకుండా, రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాలని భావిస్తున్నారని, అందుకే చేరిక పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు. ముందు ఈనెల ( జనవరి) 28 అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరతారని అనుకున్నా, ఇప్పుడు షా పర్యటన రద్దవడంతో, ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరడం ఖాయమని అంటునారు.
ఇక అప్పుడు కూడా పొంగులేటి బీజేపీలో చేరలేదంటే..ఆయన యూ టర్న్ తీసుకున్నట్లే అవుతుందని అంటున్నారు. అయితే, ముందు నుంచి కూడా పొంగులేటి బీజేపీలో చేరడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ముందుగా జనవరి 15 న ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది,అయితే మోడీ పర్యటన్ రద్దవడంతో సీన్ ఢిల్లీకి మారింది, అది జరగలేదు. మళ్ళీ జనవరి 28 న అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అనుకుంటే అదీ రద్దయింది .ఇక ఇప్పుడు ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అంటున్నారు .. ఇలా వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు, పొంగులేటి పార్టీ మారే ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, అంటున్నారు. అయితే.. ఆలస్యం అయినా, పొంగులేటికీ మాత్రం లెక్కలు సరిచూసుకునేందుకు కావలసినంత సమయం అయితే చిక్కింది.