వైసీపీలో మహిళలకు మరిన్ని టికెట్లు.. నాకు నోటికెట్.. బాలినేని
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఆల్మోస్ట్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్ననేపధ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సారి తనకు వైసీపీ టికెట్ రాకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి, ఆయనకు ఆ మేరకు సంకేతాలు వచ్చాయా, లేక అటు నుంచి రియాక్షన్ చూసేందుకు ఒక రాయి వేశారా, ఆనేది పక్కాన్ పెడితే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని, బాలినేని తనంతట తానుగా ముందుగానే ప్రకటించారు. అయితే, తనకు బదులుగా తన స్థానంలో తన భార్య సచీదేవికి టికెట్ వచ్చే అవకాశం ఉందని మరో సంకేత మిచ్చారు.
నిజానికి, బాలినేని కేవలం మాజీ మంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు. అందకే “నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే నేనైనా చేసేదేం లేదు. ఈసారి మహిళలకే అవకాశాలు అని జగన్ రెడ్డి తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే” నని బాలినేని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి 2024 ఎన్నికలు - సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజానికి,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలోనూ అందరికంటే ముందుగా బాలినేని, తనంతట తానుగా మంత్రి పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకు తిరుగుతున్నాని ప్రకటించారు. ఒక విధంగా ఇతర సీనియర్ మంత్రులను మానసికంగా తయారు చేసేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బంధువు బాలినేని చేత ఆ మాట చెప్పించారనే టాక్కూడా అప్పట్లో వినిపించింది. అలాగే, అప్పట్లో ఆయనలో ఎక్కడో లోలోపల,అందరికీ ఉద్వాసన పలికినా, బంధువు కోటాలో అయినా జగన్ రెడ్డి తనను మాత్రం మంత్రివర్గంలో కొనసాగిస్తారనే ఓ చిరు ఆశ లాంటింది ఏదో ఆయనలో ఉందని, అందుకే ఆయన, ఆ విధంగా మాట్లాడారనే వదంతులు అప్పట్లో షికారు చేశాయి.
అయితే,చివరకు బాలినేని ఒకటి తలిస్తే, జగన్ రెడ్డి ఇంకొకటి తలిచారు అన్నట్లు, బంధువు కావడం వల్లనే బాలినేనికి ఉద్వాసన పలికారని ఆ తర్వాత గానీ తెలిసిరాలేదుని అంటారు. జగన్ రెడ్డి తొలి మంతివర్గంలో ప్రకాశం జిల్లానుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటుగా ఆదిమూలపు సురేష్ కూడా మంత్రిగా ఉన్నారు. మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ముఖ్యమంత్రి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి, బాలినేనికి ఉద్వాసన పలికారు. దీంతో బాలినేని హర్టయ్యారు. అలక వహించారు.
బందువును నన్ను కాదని, ఆదిములపు సురేష్ ను కొనసాగించడం ఏమిటని, కొంత కాలం ఆయన కొంచెం చాలా బాధపడిపోయారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా బాధపడ్డారు.అయితే ఆ తర్వాత సర్దుకుపోయారు. తీరా ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చునని అన్నారు.
అయితే, బాలినేనికి టికెట్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన పని కట్టుకుని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక కసరత్తుకు అప్పుడే శ్రీకారం చుట్టినట్లుందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, ఒంగోలులో బాలినేని తన వారసుడిగా కొడుకు ప్రణీత్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని వ్యవహారాలన్నీ ఆయన కొడుకు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్తగా తన భార్య సచీదేవి పేరు తెరపైకి తేవడం విశేషం. మొత్తమ్మీద బాలినేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఏపీ మొత్తం సంచలనంగా మారాయి.
వచ్చే ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వాళ్లకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు ఉండదని క్లారిటీ ఇచ్చారు. పని తీరు బాగోలేకపోతే ఎవరినైనా పక్కన పెడతామని ఆయన అనేకసార్లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో ఇప్పుడు బాలినేని చేసిన వ్యాఖ్యలతో, ఏరివేతలు మొదలయ్యాయనే ప్రచారం జోరందుకుంది. అయితే, బాలినేని భార్యకు ఇచ్చినట్లుగానే, టికెట్ ఇవ్వని ఇతర ఎమ్మెల్యేల భార్య లేదా ఇతర కుటుబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా? అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, సగం మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈసారి మహిళలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం లేక పోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.