స్ఫూర్తిమంతం గాంధీ జీవితం : కేసీఆర్

కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ.. భారత పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని అన్నారు.  జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఆయన్ను స్మరించుకున్నారు.  నమ్మిన లక్ష్యం కోసం   ఆటంకాలన్నిటినీ అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని.. గాంధీ జీవితం  అందించిందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ ప్రతిజ్ణ చేశారు. నేటి యువత గాంధీ ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.  

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

తారకరత్న మెలెనా అనే అరుదైన రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నట్టు అంతకుముందు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో అంతర్గత రక్తస్రావం జరిగిందదని, జీర్ణాశయ అంతర్భాగంలో రక్తస్రావంగా పేర్కొనే అరుదైన మెలెనా వ్యాధితో ఆయన బాధపడుతున్నారని వివరించారు.   దీని కారణంగా   గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ,   రక్తపోటును అదుపులో ఉంచాల్సి వస్తుంది. అయితే తారకరత్న  చికిత్సకు స్పందిస్తున్నారనీ, అది చాలా మంచి సింప్టమ్ అని వైద్యులు తెలిపారు.  నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న శుక్రవారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   బెలూన్‌ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నందమూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ  జూనియర్ ఎన్టీఆర్ వీలేకరులతో మాట్లాడుతూ.. తారకరత్న పూర్తిగా కోలుకుని త్వరలో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ, చికిత్సకు స్పందిస్తుండటంతో కోలుకుంటారన్న విశ్వాసం ఉందని అన్నారు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్

నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్‌పై  6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.24 ఏళ్ల స్టెఫనోస్ త్సిత్సిపాస్‌ గట్టిగా పోరాడినప్పటికీ  జకోవిచ్ ముందు నిలువలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఏకంగా 10వసారి జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జకోవిచ్ నిలిచాడు. ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్..   అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది. అంతే కాకుండా జకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ వరుసగా 28 మ్యాచ్‌లు గెలుపొందడం మరో విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్లలోనూ జకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుస సెట్లు గెలుచుకుంటూ దూసుకెళ్లాడు. గతంలో కూడా జకోవిచ్ సిట్సిపస్‌పై ఎక్కువ విజయాలు సాధించాడు. జకోవిచ్-సిట్సిపస్ మధ్య విజయాల సంఖ్య 11-2గా ఉంది. చివరిగా వీరిరువురూ 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డారు. అప్పుడూ విజయం సాధించినది జకోవిచ్.  ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్‌కు అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.   జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 టైటిల్స్ సాధించాడు. మెన్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సంబంధించి రఫెల్ నాదల్, జకోవిచ్   22 టైటిల్స్ తో సమంగా ఉన్నారు. వీరి తరువాత తర్వాత రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, పీట్ సంప్రాస్ 14 టైటిల్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు. 

మహిళల అండర్ 19 వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా

అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్ తో ఆదివారం (జనవరి 29) జరిగిన ఫైనల్లో భారత అండర్-19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.  ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లు సదు, అర్చన దేవి, పర్షవీ చోప్రా రెండేసి వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.   అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమ్ ఇండియా 14 ఓవర్లలోనే మూడు వికెట్లకు కోల్పోయి 69 పరుగులు చేసి విజయన్నందుకుంది.  తెలుగమ్మాయి గొంగడి త్రిష 29 బంతుల్లో 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యా తివారి 37 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చింది. మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.   

జనం మనిషి లోకేష్.. మొదటి రోజును మించి రెండో రోజు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండో రోజు ముగిసింది. మొదటి రోజుతో పోలిస్తే లోకేష్ గళం మరింత పదునెక్కింది. సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మరింత సూటిగా, స్పష్టంగా జనం హృదయాలలో నాటుకునేలా ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  లోకేష్ పాదయాత్ర అనగానే అధికార పార్టీ నేతల్లో ఎందుకంత గాభరా అన్న విషయం అర్ధమైపోయింది.   విదేశాలలో విద్యాభ్యాసం చేసి వచ్చిన యువకుడు.. ఇక్కడి పరిస్థితులను, ఇక్కడి ప్రజల నాడిని అర్ధం చేసుకుని.. జనంలో కలిసి వారికి దగ్గర కాగలడా అన్న అనుమానాలు ఎవరిలోనైనా ఏ మూలనో ఇంకా మిగిలి ఉంటే.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజే అవన్నీ పటాపంచలైపోయి ఉంటాయి.  రెండో రోజు పాదయాత్రలో భాగంగా శనివారం (జనవరి 28) ఉదయం పేస్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించి పాదయాత్ర ప్రారంభించారు.   బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. బీసీ సంఘాల నేతలతో కాకుండా నేరుగా   ప్రజలతో సంభాషించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా.. సమస్యలు పరిష్కరించి, ఉపాధి కల్పించి, ఆర్థికంగా మెరుగైన జీవనాన్ని కల్పిస్తామన్న భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకం అవ్వడంలోనూ కొత్త ఒరవడికి నాంది పలికారు. తాను నడుస్తుంటే జనం తన వద్దకు వచ్చిన వారిని పలకరిస్తూ ముందుకు సాగడమే కాదు.. పొలాలలో పని చేసుకుంటున్న వారి వద్దకు స్వయంగా వెళ్లి  పలకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు. విద్యార్థులతో  డిగ్రీ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇలా అన్ని వర్గాల వారితోనూ సంభాషిస్తూ లోకేష్ సాగుతున్న తీరు అందరినీ మెప్పిస్తోంది. ప్రజలు చెప్పే సమస్యలను శ్రద్ధగా వింటున్నారు, వారి సమస్యలకు జగన్ సర్కార్ విధానాలు ఎలా కారణమయ్యాయో వారికి వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాకా వాటిని ఎలా పరిష్కరిస్తామో చెబుతున్నారు. మొత్తంమీద లోకేష్ అడుగులు, మాటలు ప్రజలకు భరోసా ఇచ్చేలా సాగుతున్నాయి.  

తారకరత్న కోలుకోవడానికి సమయం పడుతుందంటున్న వైద్యులు

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన   బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు శనివారం (జనవరి 28) విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. కాగా తారకరత్నను పరామర్శించేందుకు శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి  తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు   ధైర్యం చెప్పారు. తారకరత్నకు ఐసీయీలో చికిత్స కొనసాగుతోందని, అబ్జర్వేషన్ లో పెట్టారని వెల్లడించారు.  తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు.   నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు వచ్చిన  తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం బెంగళూరు ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యుల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం తారకరత్నకు రక్త  ప్రసరణలో ఇంకా అంతరాలు వస్తున్నాయి. బ్లాక్స్ అధికంగా ఉన్న కారణంగా తారకరత్న కోలుకునేందుకు ఎక్కువి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.   ఇలా ఉండగా తారకరత్నకు ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. తారకరత్నను హృదయాలయ ఆసుపత్రిలో శనివారం (జనవరి 28) పరామర్శించిన వారిలో దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు కూడా ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న దగ్గుబాటి ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. చిన్న వయస్సులో తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరమన్నారు. సోమవారం తారకరత్నకు మరిన్ని పరీక్షలు నిర్వహించి ఎలా చికిత్స కొనసాగించాలన్న విషయం వైద్యులు నిర్ణయిస్తారన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నామనీ అన్నారు.  

కేంద్రానికి ఆ దమ్ముందా?..ముందస్తు పై మంత్రి కేటీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చను మంత్రి కేటీఆర్ మరోమారు తెరపైకి తీసుకు వచ్చారు. ఆయన ముందస్తు ఎన్నికల విషయంలో బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. కేంద్రం లోక్ సభను  రద్దు చేసి ముందస్తుకు రెడీ అయితే తాము కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం అని పేర్కొన్నారు.  ఇటీవల అభివృద్ధ, సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం జోరుగా ముందుకుసాగతం,  ముఖ్యమంత్రి  కేసీఆర్ జిల్లాల పర్యటనల చేపడుతున్న నేపథ్యంలో మరో సారి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారంజోరందుకుంది.  వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ ప్రారంభోత్సవం చేయడనుండటం, ఫిబ్రవరి మొదటి తేదీన లేదా ఆ మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికలు ఖాయమన్న భావాన్ని కలిగిస్తున్నాయి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరందుకుంది.  ఈ క్రమంలోనే నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ముందస్తు ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. శనివారం (జనవరి 28) నిజామాబాద్ లో పర్యటించిన ఆయన  ముందస్తుకు సిద్ధపడితే తాము కూడా రెడీ అని సవాల్ చేశారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్ష కట్టిందన్నారు. కేంద్రం చేయలేని అభివృద్ధిని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే సత్తా మాకుందని.. కేంద్రం ఏం చేసిందో చెప్పే సత్తా బీజేపీకి ఉందా అని నిలదీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని.. విభజన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రెండు లక్షల కోట్ల తెలంగాణ పన్నులను.. కేంద్ర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ నుండి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. నేను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.   

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యులు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన పూర్తిగా వైద్య సాయంపైనే ఆధారపడి ఉన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని నారాయణ హృదయాలయ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయనను కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇక్కడకు చేరుకునే సమయానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అప్పటి నుంచి నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది.  ప్రస్తుత పరిస్థితుల్లో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, వచ్చి చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో  కోరింది. కుప్పంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం (జనవరి 28) ప్రారంభమైన సంగతి తెలిసిందే. లోకేష్ కు మద్దతు తెలిపేందుకు వచ్చి పాదయాత్రలో అడుగు కలిపిన తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి విదితమే. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తీసుకు వచ్చారు. ఆయనకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఇలా ఉండగా తారకరత్నను పరామర్శించేందుక మరి కొద్ది సేపటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకుంటారు.

సీబీఐ విచారణకు ముందు విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం (జనవరి 28,2023) సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్న ఆయన సీబీఐ విచారణ కోసం ఆ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు.  లోటస్ పాండ్ లో విజయమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమెతో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడారు  అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి  బయలుదేరి వెళ్లారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అంతకు ముందు  లోటస్ పాండ్ కు వెళ్లి  సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరి కొద్ది సేపటిలో బెంగళూరుకు చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా?

నందమూరి తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరి కొద్ది  సేపటిలో బెంగుళూరు వెళ్లనున్నారు.  కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు బయలు దేరుతున్నారు.  తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.    లోకేష్ కు మద్దతుగా కుప్పంలో యువగళం యాత్రలో పాల్గొన్న  యాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్నఅస్వస్థతకు గురి కావడంతో  ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.   టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని ఆయనను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు బెంగళూరు బయలుదేరి వెళుతున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నను పరామర్శించేందుకు బెంగళూరు బయలుదేరనున్నట్లు సమాచారం.  ఇప్పటికే బాలకృష్ణ బెంగళూరులో ఉన్నారు. ఆయన దగ్గరుండి తారకరత్నకు అందుతున్నచికిత్సను పర్యవేక్షిస్తున్నారు. 

రేపో మాపో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!.. తెలుగు రాష్ట్రాలకు నో చాన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఈ నెల31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ రాజకీయ వర్గాల భోగట్టా. ఆ మేరకు రేపో మాపో మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి.  2023) ఒక విధంగా ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో .. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది ( 2024)లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని   కేంద్ర మంత్రి వర్గంలో    మార్పులు చేర్పులు చేసేందుకు మోడీ   నిర్ణయించారనీ, ఇందు కోసం భారీ కసరత్తు కూడా చేశారని అంటున్నారు.    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది పైగా గడువు ఉంది.  ఈ నేపధ్యంలో, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రెడీ అయ్యారని అంటున్నారు.  కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్‌ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు మొత్తం   78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురిని కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నారు.   కేవలం అవకాశం ఉన్న ఐదుగురికి స్థానం కల్పించడమే కాకుండా పని తీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన పలికి.. మరి కొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పోతే ఈ ఏడాది  జగరనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలన్న పట్లుదలతో ఉంది. అందుకే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనగానే తెలంగాణకు బెర్త్ ఖాయం అంటూ ఊహాగానాలు చెలరేగాయి. అలాగే గత మూడున్నరేళ్లుగా  కేబినెట్ లో అసలు ప్రాతినిథ్యమే లేని ఏపీకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వినవచ్చాయి. అయితే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు రిక్తహస్తమేనని ఢిల్లీలోని బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్ఠిలో పెట్టుకుని అన్ని విధాలుగా ఆలోచించి.. మోడీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరనించనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

వస్తున్నా.. న్యాయవాదిని తెచ్చుకుంటా.. సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ

సీబీఐ నోటీసుల మేరకు తాను శనివారం (జనవరి 28) విచారణకు హాజరౌతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి శనివారం (జనవరి 28)  హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తాను శనివారం  సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.  కేసు విచారణ పారదర్శకంగా సాగాలని   ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అలాగే తనతో పాటుగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆ లేఖలో కోరారు.  

బీఆర్ఎస్ లో తెలుగు, తెలంగాణ మాయం

తానే మారెనో, తలపే మారెనో.. తెలంగాణ ఊసే మరిచెనో అన్నట్లుగా తయారైంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. తెలంగాణ  రాష్ట్ర సమితి.. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన ఉద్యమ పార్టీ.. ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించిన  ఆ పార్టీ నేత  పార్టీలో ఉద్యమ స్ఫూర్తికి చరమ గీతం పాడేశారు. ఆ  తరువాత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి.. తెలంగాణ పదాన్ని తొలగించారు. దానితో పాటే తెలంగాణ ఆత్మకూ తిలోదకాలిచ్చేశారు. ఇక ఇప్పుడు విస్తరణలో భాగంగా తెలుగు భాషకూ చెల్లు చీటీ పాడేశారు. నిజమే బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ.. ప్రాంతం, భాష తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలకూ, భాషలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అంత వరకూ అయితే అభ్యంతరం లేదు. అందుకు తగినట్లుగానే బీఆర్ఎస్ లో ఇతర రాష్ట్రాల వారు ఎవరన్నా చేరితే ఆ రాష్ట్ర భాషలో కండువాలు తయారు చేయించి కప్పుతున్నారు. అంత వనరై ఓకే. కానీ తెలంగాణ రాజధానికి వచ్చి బీఆర్ఎస్ లో చేరే వారిని పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో కూడా తెలుగుకు, తెలంగాణకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటీవల ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో ఎక్కడా తెలంగాణ కనిపించలేదు. తెలుగు భాష కనిపించలేదు. భారత దేశం మ్యాప్, హిందీ, ఇంగ్లీషు, ఒరియాలలో బ్యానర్లు మాత్రమే దర్శనమిచ్చాయి.    తెలంగాణ భవన్ లో జరిగే బీఆర్ఎస్ కార్యక్రమాలలో సైతం పార్టీ బ్యానర్లు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషలోనే దర్శనమిస్తున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల వారి చేరికల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లలో  ఆయా రాష్ట్రాల భాషలో మాత్రమే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.  ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలను ఏ భాషలో ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నాయకులు మధన పడుతున్నారు.   రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇటీవలి కాలంలో కేసీఆర్ అసలు ప్రస్తావించడం లేదనీ, ఎంత సేపూ కేంద్రంపై విమర్శలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భేటీలు, సమావేశాలూ, చర్చలకే పరిమితమౌతున్నారనీ, దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పార్టీ దూరం అవుతోందని పార్టీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు సార్లు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణను విస్మరించడమంటే మూలాలను వదిలేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ సంగతి అలా ఉంచి ఇదే తీరు కొనసాగితే.. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమౌతుందో కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

యువగళం డే నంబర్ 2 ప్రారంభం

కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్ నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి   నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. ఈ రోజు ఆయన 9.7 కిలోమీటర్లు నడవనున్నారు.  బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటా మంతీలో పాల్గొంన్నారు.  కలమలదొడ్డిలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగించి శాంతిపురం క్యాంప్ కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖలతో భేటీ అవుతారు. శనివారం ఆయన శాంతిపురంలో బసచేస్తారు.  ప్రముఖులతో సమావేశమవుతారు. కుప్పంలోని శాంతిపురంలో రాత్రి బస చేయనున్నారు. తొలి రోజులాగే రెండో రోజు కూడా లోకేష్ పాదయాత్రలో అడుగు కలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులూ తరలి వచ్చారు. వారికి అభిమాదం చేస్తూ లోకేష్ ముందుకు కదిలారు.

ఎక్మోపై తారకరత్న.. కండీషన్ క్రిటికల్?

కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.    లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను   వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.   టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు.  

కొందరు సీనీ నటులకు ఎమ్మెల్సీ తాయిలాలు.. జగన్ ఎత్తుగడ

జగ‌న్ కు ఈసారి సినిమా వాళ్ళ అవసరం తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. సర్వేలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవమెంతో తెలియదు కానీ జగన్ స్వయంగా ఐ ప్యాక్ ద్వారా చేయించుకున్న సర్వేలో కూడా ఆయన క్యాబినెట్ లోని పాతిక మంది మంత్రులు వచ్చే ఎన్నికలలో ఓటమి చవిచూడనున్నారని తేలింది. మరో వైపు ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్త దాదాపు ఖరారైంది. బీజేపీ సంగతి ఇంకా ఎటూ తేలకపోయినా, తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ పార్టీకి పరాజయం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోకతప్పదని అంటున్నారు. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు, కృష్ణుడు, భానుచందర్, అలి, పోసానికృష్ణమురళి, రాజశేఖర్, జీవిత, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇలా జాబితా పెద్దదే ఉంది. అయితే ఈ సారి మాత్రం జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఇప్పటి వరకూ అయితే అలీ, పోసాని వినా మరెవరూ కనిపించడం లేదు. మోహన్ బాబు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డారు. జగన్ అధికారం చేపట్టగానే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వికి మాత్రమే పదవి ఇచ్చారు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇక ఆ తరువాత మూడున్నరేళ్లకు అలీ, పోసానిలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు. మిగిలిన వారి గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.  దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు ఒకింత దూరంగానే ఉంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ గట్టెక్కేందుకు మరో సారి సినీ జీవులపైనే ఆధారపడనున్నారని పరిశీలకులు అంటున్నారు. అందు కోసమే.. వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చేందుకు యోచిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే మార్చిలో రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని సీనీ జీవులతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అది ఎంత వరకూ సాధ్యమౌతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే పార్టీలో కూడా జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. చిలకలూరిపేట   మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో పాటు పలువురికి జగన్ ఇప్పటికే హామీ  ఇచ్చారు.  ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో పవన్ ను విమర్శించే వారికి జగన్ పెద్దపీట వేయొచ్చు అనే మాట వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వచ్చే ఎన్నికలలో పార్టీకి సినీ గ్లామర్ ను అద్దడానికి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకోసమేనా?

ఏపీ సీఎం హఠాత్తుగా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. నిర్దుష్టంగా ఇందుకు కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన హస్తిన పర్యటన కోసమే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    శుక్రవారం, శనివారం నాటి పర్యటనలను జగన్ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఇంకా బయలుదేరలేదని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రుక్రవారం (జనవరి 27)  ఉమ్మడి చిత్తూరు జిల్లా  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది.  అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు వైసీపీ నేత ఇంట్లో జరిగే వివాహ వేడుకకు సైతం సీఎం   హాజరవ్వాల్సి ఉంది. అలాగే శనివారం జగన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. విశాఖలో ఆయన చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ సభ్యుల నివాసాల్లో జరిగే వివాహ వేడకలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలను ఇంత అర్థాంతరంగా రద్దు అయ్యాయి.  హస్తిన పర్యటన కోసమే ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయని అంటున్నారు. కు ఎందుకు వెళ్తున్నారంటూ సదరు వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.  అయితే సీఎం ఢిల్లీ పర్యటనపై సీఎంవో కార్యాలయం పెదవి విప్పడం లేదు. దీంతో జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ఎందుకు అన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.   కడప ఎంపీ ఆవినాశ్ రెడ్డి.. శనివారం (జనవరి 28)  సీబీఐ ఎదుట... విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అలాగే జనవరి 31వ తేదీన రాజధాని కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో  జగన్.. తన ఢిల్లీ పర్యట ప్రాధాన్యత సంతరించుకుంది.   వివేకా హత్య కేసులో   అవినాశ్ రెడ్డికి ఇటీవల సీబీఐ నోటీసులు అందజేసింది. అయితే తాను.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని.. సీబీఐ అధికారులకు  అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది. దీంతో అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసైనా విచారించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.    ఇప్పటికే  వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే అంశంపై సీబీఐకి ఓ క్లారిటీ వచ్చిందని.. ఈ నేపథ్యంలో వైయస్ ఫ్యామిలీలోని పలువురు కీలక వ్యక్తులను విచారించి.... అనంతరం సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులతో జోరుగా సాగుతోంది.    ఇటీవల  అవినాశ్ రెడ్డి తండ్రి   భాసర్కరెడ్డి కోసం..  సీబీఐ ఆరా తీయడం కూడా అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డిలను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా ఆయన శుక్రవారం (జనవరి 27)నే హస్తినకు బయలుదేరుతారని భావించారు. అయితే కారణాలేమిటైనా పర్యటనలు రద్దు చేసుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఏ క్షణంలోనైనా హస్తిన నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని ఆయన ఎదురు చూస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

కివీస్ తో తొలి టి20.. టీమ్ ఇండియా పరాజయం

టీమ్ ఇండియా వరుస   విజయాలకు  బ్రేక్ పడింది. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం (జనవరి 27) జరిగిన తొలి మ్యాచ్ లో భాతర్ పోరాడి ఓడింది.  న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా  టీ20 సిరీస్ ను మాత్రం ఓటమితో మొదలెట్టింది.  తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)   హాఫ్ సెంచరీ వృధా అయ్యింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా  15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. గి ల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47(34 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం కరవైంది. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, శాంట్నర్, ఫెర్గుసన్ చెరో 2 వికెట్లు తీశారు. డఫీ, సోధీ తలో వికెట్ తీశారు.  అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 ల సిరీస్ లో 1-0తో కివీస్ లీడ్ లో ఉంది.   ఇరుజట్ల మధ్య రెండో టి20 ఆదివారం (జనవరి 29) లక్నో వేదికగా జరుగుతుంది.

యువగళం డే నంబర్ 1.. ఆకట్టుకున్నారు.. అదరగొట్టేశారు!

తొలి అడుగు అదిరింది. ఆరంభం బ్రహ్మాండంగా ఉంది. కుప్పం నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర అధికార పార్టీపై విమర్శలతో, ప్రజా సమస్యల పరిష్కారం హామీలతో సాగింది. అదే సమయంలో పరోక్షంగానైనా జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉంటుందన్న సందేశాన్నీ ఇచ్చింది.  ఈ సందర్భంగా లోకేష్ వేసిన ప్రతి అడుగులోనూ ఆయనలో పరిణితి చెందిన నాయకుడు కనిపించాడు. రాజకీయ విమర్శలు చేస్తూనే వాటిని ప్రజా సమస్యలతో మేళవించారు. తన రాజకీయం ప్రజల కోసమేననీ, రాష్ట్రంలో దుష్టపాలన అంతం చేయడానికేననీ విస్పష్టంగా చాటారు.   తొలి రోజు పర్యటనలో ఆయన ప్రసంగం ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ, జగన్ సర్కార్ ను ఎండగడుతూ సాగింది. ఎక్కడా తడబాటు లేదు. తనపై, తెలుగుదేశంపై మంత్రులు గతంలో చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రిని జాదూరెడ్డిగా అభివర్ణించారు. రాష్ట్రంలో జాదూ రెడ్డి పాలన అంతా జాదూయే అని చెప్పారు.  జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.  మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు.  తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యావత్ ప్రపంచం అచ్చెరువొందేలా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. జాదూరెడ్డి వచ్చి  రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అలాగే జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్ లు ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  ఇక మంత్రి రోజాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనకు చీర, గాజులు పంపిస్తామని ఓ మహిళా మంత్రి అన్నారు.. పంపమనండి వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని కౌంటర్ ఇచ్చారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు.   జే బ్రాండ్‌ మద్యంతో జాదూరెడ్డి మహిళల మంగళసూత్రాలు తెంపుతున్నాడంటూ విమర్శించారు.  రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.  జే ట్యాక్స్‌ కట్టలేక పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తేనో.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు.   ఎక్కడా తడబాటు లేకుండా జగన్ వైఫల్యాలనూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న విషయాలను సూటిగా, స్పష్టంగా జన హృదయాలను హత్తుకునేలా చెప్పారు. తాను పాదయాత్ర పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిసిపోయాయన్నారు. అందుకే జీవో నంబర్ 1 తెచ్చారని లోకేష్ అన్నారు. పాదయాత్ర అనుకోగానే తన సన్నిహితులు కొందరు వారించారనీ, సొంత బాబాయ్ ని చంపేసిన వ్యక్తి.. ఎంతకైనా తెగిస్తాడు వద్దని చెప్పారనీ లోకేష్ అన్నారు. అయితే  స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చదివా. వరల్డ్‌ బ్యాంక్‌లో పనిచేశా. హెరిటేజ్‌ వంటి పెద్ద వ్యాపార సంస్థను నిర్వహించా. ప్రజల కంట కన్నీరు చూసి పాదయాత్ర చేస్తున్నానని వారిని సముదాయించానన్నారు, భయం అన్నది నా బయోడేటాలోనే లేదు అని లోకేష్ ఉద్ఘాటించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే యూత్‌ మేనిఫెస్టో తెస్తామన్నారు, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. ఇలా ఏం చేస్తామో చెప్పడమే కాకుండా.. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసినదేమిటో కూడా చెప్పారు.  పంచాయతీరాజ్‌ మంత్రిగా 25 వేల కిలోమీటర్ల   సిమెంట్‌ రోడ్లు వేయించా, పల్లెల్లో 25 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయించా. 25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఐటీ మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రంలో 80 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించానని లోకేష్ గుర్తు చేశారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ సర్కార్ ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు.