బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీకి లబ్ధి చేకూరేలా కేసీఆర్ చాణక్యం
posted on Jan 20, 2023 @ 3:36PM
కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్ నిజంగా ఆ లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నారా? అందు కోసమే దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించేశారా? ఆ దిశగా ఆయన అడుగులు సవ్యంగా పడుతున్నాయా? అంటే మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రాదు.
ఆయన పైకి చెబుతున్న లక్ష్యం ఒకటి.. ఆచరణలో అమలు చేస్తున్న వ్యూహం మరొకటి అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేసీఆర్ బయలకు బీజేపీ లక్ష్యం అని చెబుతున్నా.. ఆయన టార్గెట్ చేసింది మాత్రం కాంగ్రెస్స్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం బీఆర్ఎస్ సభను చూపుతున్నారు. ఆ సభకు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హాజరు కావడం, ఆ మరునాడే ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రకటించడాన్ని చూపుతున్నారు. అలాగే అంతకు ముందు ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఒడిశా నుంచి గిరిధర్ కుమార్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా... 9 సార్లు లోక్ సభ ఎంపీగా.. 1999, ఫిబ్రవరి 17 నుంచి 1999, డిసెంబర్ 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గిరిధర్ గమాంగ్ తన కుమారుడికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన తన కుమారుడితో కలిసి కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్ గానే పావులు కదుపుతున్నారనడానికి వీటికి తోడు.. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆయన బేరసారాలు జరిపారన్న ఆరోపణలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నది రేవంత్ ఆరోపణ. ఆ రాష్ట్రానికి చెందిన దాదాపు పాతిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారనీ, ఇందుకు వారికి రూ.500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.
ఈ ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చేవిగానే బీఆర్ఎస్ గమనం, ప్రస్థానం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైకి బీజేపీని గద్దె దించడమేనని కేసీఆర్ చెబుతున్నా.. ఆయన అసలు లక్ష్యం మాత్రం కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే కేసీఆర్ అక్ష్యమని అంటున్నారు.
తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకలోతు ఇరుక్కుపోవడం, అలాగే తనపైనా కొన్ని పాత కేసులు ఉండటంతో వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్ బీజేపీకి లోపాయకారీ సహకారం అందిస్తున్నారనీ, అందుకే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు దోహదం చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ మంచి మిత్రులు, ఇద్దరూ కూడా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు.. అలాగే కేసీఆర్ తెలంగాణలో మరోసారి గద్దెనక్కాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. ఈ సారి అంత సులభ సాధ్యం కాదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ లు ఇరువురూ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందుకే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇద్దరూ కూడా వ్యూహాత్మక వైరం పాటిస్తున్నారు.
ఈ ఆరోపణలన్నీ గతం నుంచీ ఉన్నవే. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత ఆ ఆరోపణలన్నీ నిజమేనని నమ్మడానికి వీలు కలిగించేవిగానే కేసీఆర్ అడుగులు, వ్యూహాలూ ఉన్నాయి. కేసీఆర్ జాతీయ రాగం అందుకున్న క్షణం నుంచీ ఆయన ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆ పార్టీకి దూరం చేసి కాంగ్రెస్ ను ఏకాకిని చేయడంగానే సాగాయి. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు. అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్రగానే పరిశీలకులు చెబుతున్నారు. సరే కేసీఆర్ చేసిన ఆ ప్రయత్నాలు ఫలించ లేదు అది వేరే విషయం.
ఇప్పుడు సొంతంగా బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ పెట్టి కూడా అవే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుకా మోడీని మరో సారి కేంద్రంలో అధికారంలో కూర్చోపట్టి, తెలంగాణలో తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. పనిలో పనిగా తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కూడా బీజేపీకి, మోడీకి తెరవెనుక నుంచి సాయపడుతున్నారని అంటున్నారు.