యాత్ర ముగింపుకు ముందే అభియాన్ ఆరంభం
posted on Jan 22, 2023 6:16AM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన యాత్ర జనవరి 30వ తేదీన కశ్మీర్ లోముగుస్తుంది. భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముగింపు సభకు భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆాయా పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. బీఎస్పీ- మాయావతి, టీఎంసీ- మమతా బెనర్జీ, జేడీయూ- నితీశ్ కుమార్, టీడీపీ- చంద్రబాబు నాయుడు, ఆర్జేడీ- లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ- అధినేత అఖిలేష్ యాదవ్, వంటి వారితో పాటు.. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. జనవరి 30న జరిగే సభను ఎలాగైనా సరే విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.
అయితే ఇక్కడితో యుద్ధం ఆగదని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీ సారథ్యంలో సాగిన 'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ, యాత్ర ముగింపుకు నలుగు రోజులు ముందుగానే, జనవరి 26 శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు సంబంధించిన లోగోతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును హస్తం పార్టీ విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి రెండు నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో ప్రచారం సాగనుందని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు తెలిపారు.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) స్టేట్ స్పెసిఫిక్ చార్జిషీట్లు తయారు చేస్తాయని వేణుగోపాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వ అవకతవక విధానాల కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు తమ పార్టీ కృష్టి చేస్తుందన్నారు. 130 రోజుల చారిత్రక భారత్ జోడో యాత్ర తర్వాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, లక్షలాది మంది రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేసి ఆయనతో సంభాషించారని చెప్పారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఈతి బాధలను తాము అవగతం చేసుకున్నామని అన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని కతువాలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తమ పార్టీ చేపట్టనున్న ఇంటింటి ప్రచారం 6 లక్షల గ్రామాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లోని 10 లక్షల పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్తామని చెప్పారు. హాథ్ సే హాథ్ జోడో ప్రచారం జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ జరుపుతామన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేస్తారని చెప్పారు.