రేవంత్ తో వెంటకరెడ్డి భేటీ.. కాంగ్రెస్ సీనియర్లకు షాక్
posted on Jan 21, 2023 @ 4:15PM
రాజకీయాలలో శాత్వత శతృత్వం, శాశ్వత మితృత్వం అంటూ ఉండవు. నేడు బద్ధ శత్రువుల్లా ఉన్న వారు రేపు ఆప్త మిత్రులుగా మారి ఆలింగనం చేసుకుంటారు. నిన్న ఆప్త మిత్రులుగా ఉన్న వారు నేడు ఆగర్భ శతృవులుగా మారి కత్తులు దూసుకుంటారు.
రాజకీయాలలో ఇది సహజం. కానీ అలా ఎంతలా సరిపెట్టుకుందామనుకున్నా వీలుకాని సంఘటనకు గాంధీ భవన్ వేదికైంది. ఆ ఇరువురి భేటీ కాంగ్రెస్ శ్రేణులనే కాదు.. సామాన్య జనాలను సైతం ఆశ్చర్య చకితులను చేసింది. ఔను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ వేదికగా కలుసుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. కొద్ద సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా గతం గత: అన్న వెంకటరెడ్డి.. తానెప్పుడూ గాంధీ భవన్ ముఖం చూడనని అన్న పాపాన పోలేదన్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తన విధులు తాను నిర్వర్తిస్తానని చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయా అన్న ఆశలను పార్టీ వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి.
ఎందుకంటే ఇద్దరి మధ్యా కొంత కాలంగా ఎడముఖం, పెడముఖంగా పరిస్థితి ఉంది. అటువంటిది ఇరువురూ సడన్ గా కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. థాక్రే ఆహ్వానం తో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వచ్చారు. రేవంత్ తో కలిసి భేటీ కావడం పార్టీలో రేవంత్ వ్యతిరేకులకు మింగుడు పడటం లేదు అది వేరే సంగతి. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిందేమిటంటే..
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతల చేపట్టిన నాటి నుంచీ కోమటిరెడ్డి విభేదిస్తూనే ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వ్యక్తిగా పార్టీ పగ్గాలప్పగించడమేమిటని అధిష్ఠానాన్ని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ సహాయ నిరాకరణ చేశారు. స్టార్ క్యాంపెయినర్ అయి ఉండీ మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్నా కోమటిరెడ్డి హాజరు కాలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. దీంతో కాంగ్రస్ నాయకత్వం వెంకటరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో కానీ.. గాంధీ భవన్ కు వచ్చి రేవంత్ తో చేతులు కలిపి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ లో సీనియర్, జూనియర్ విభేదాలకు కారణమైన వెంకటరెడ్డి రేవంత్ తో చేయి కలపడంతో కాంగ్రెస్ లో సంక్షోభం ప్రస్తుతానికి టీ కప్పులో తుపానుగా చల్లారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.