సర్కార్ వారి జీవోలకు అర్థాలే వేరులే!
అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఒక చక్కని సత్యాని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నీ అమలవుతాయని ఎవరికైనా ఓ చెడ్డ, దురాభిప్రాయం ఏదైనా ఉంటే, ఆ అభిప్రాయాన్ని వెంటనే తుడిచేసుకోండని నిండు సభలో గొంతెత్తి మరీ చెప్పారు. జీవోలన్నీ జీవోలు కాదు, అందులో కొన్ని ఉత్తుత్తి జీవోలుంటాయని రోశయ్య సర్కార్ వారి సీక్రెట్ ఓపెన్ చేశారు. నిజమే సమయ సందర్భాలను బట్టీ రాజకీయ అవసరాలను బట్టీ, ప్రభుత్వం జీవోలు జారీచేయడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే, అన్ని జీవోలను అలా తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు.
కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలే కాదు, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలు కూడా వచ్చి పోతున్నాయి. అవును జగన్ రెడ్డి విచిత్ర సర్కార్ జారీ చేసే జీవోల్లో ఎన్ని పని చేస్తాయో.. ఎన్ని రాజ్యాంగ బద్దంగా ఉంటాయో.. చెప్పడం కష్టం. అనేక జీవోలను కోర్టు కొట్టి వేస్తే.. కొన్ని జీవోలను ప్రభుత్వం తనకు తానే రద్దు చేసుకుంటూ ఉంటుంది. మరోవంక మరికొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్ లో లేకుండా చీకటి కొట్లో దాచేస్తుంది.
తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు ఒకే రోజు కాలం చేశాయి.. అందులో ఒకటి ఫ్లెక్సీ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు పక్కన పెట్టింది. అలాగే, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఐదు శాతం పేదలకివ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. అర్థాంతరంగా తనువు చాలించిన ఈ జంట జీవోలకు ఒక చిన్నపాటి చరిత్ర వుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం విశాఖ బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేసేందుకు ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. మైక్ ముందు నిలబడి తమదైన స్టైల్లో గంభీర ఉపన్యాసం చేశారు. అదే ఊపులో ( గిట్టని వాళ్ళు పూనకం అంటారు) ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది. అధికారులు ముందు వెనక చూసుకోకుండా ఫ్లెక్సీలను నిషేధిస్తూ జీవోను తెచ్చారు. దీంతో ఫ్లెక్స్ ల మీద ఆధారపడి బతుకుతున్న వ్యాపారులు తమ బతుకు తెరువు మీద బండరాయి పడిందని ఆందోళనకు గురయ్యారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదే రోజు నుంచే బ్యాన్ అమల్లోకి వస్తుందన్నారు కానీ ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కానీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆ జీవో చెల్లదని.. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలు ఉంటే.. వాటిపైనే నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని.. సింగిల్ యూజ్ కానే కాదని వ్యాపారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినా. జగన్ రెడ్డి ప్రభుత్వం (బహుశా సహజసిద్ద దురహకారంతో కావచ్చును) నథింగ్ డూయింగ్ ముఖ్యమంత్రి మాట తప్పరు మడమ తిప్పరు అని మొండి కేసింది. ఇక చేసేది లేక వ్యాపారాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు జీవో చెల్లదని తీర్పు ఇవ్వడంతో పాటుగా, సర్కార్ నెత్తిన నాలుగు అక్షింతలు కూడా వేసింది.
అలాగే ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాలని గతంలో జీవో ఇచ్చారు. స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని జీవోలో పేర్కొన్నారు. అంటే ప్రతి వెంచర్ లో 10 శాతం సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న దానికి అదనంగా మరో 5 శాతం స్థలం వదలాల్సి ఉంది. అయితే ఇది చట్ట విరద్ధమని.. చాలా మంది కోర్టు కెళ్లారు. చివరికి జగన్ రెడ్డి ప్రభుత్వం స్వహస్తాలతో సదరు జీవోను వెనక్కి తీసుకుంది. అఫ్కోర్స్ జీవో అమలు కాలేదు కానీ, కావాల్సిన వారికి కావలసిన మేళ్ళు జరిగాయని అంటారనుకోండి అది వేరే విషయం. ఉత్తుతి జీవోనే అయినా ఉత్తినే వెనక్కి తీసుకోలేదని చాలా మంది చేతులు తడిపిన తర్వాతనే జీవో వెనక్కి వెళ్లిందని అనేవాళ్ళు ఉన్నారు. అయినా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని వాళ్ళకు మాత్రం తెలియదా ఏంటి?
నిజానికి, ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా తెచ్చిన జీవోలేన్ని? అడ్డదారిన పట్టుకొచ్చిన జీవో లెన్ని? అందులో బతికిన వెన్ని? ఉన్నవెన్నిఅని లెక్కతీస్తే, పక్కాగా మాలిన జీవోలు ఓ పుంజీడు అయినా ఉంటాయో లేదో అనుమానమే అంటున్నారు అధికారులు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం జీవోలకు ముసుగులు వేస్తుంది. సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు. నిజానికి అస్మదీయులకు మేళ్ళు చేసేందుకు సీక్రెట్ గా తెచ్చిన జీవోలను జగన్ రెడ్డి ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోందని అంటున్నారు. అందులో కొన్ని జీవోలు వెలుగు చూస్తే, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు, చిన్నా పెద్ద కాంట్రాక్టులు ఇలా ఒకటని కాదు, సర్కార్ వారి అవినీతికి అద్దం పట్టే అనేక జ్వోలు వెలుగు చూస్తాయని అంటునారు. అయితే అది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం జరగదు గాక జరగదని అంటున్నారు .