ఎర్రబెల్లి ఓవరాక్షన్.. సీఎం సీరియస్?
posted on Jan 21, 2023 @ 9:33AM
ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పనకకరలేదు.
అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లెక్కుంది, ఆయనకు దగ్గరయ్యే కొద్ది దూరం పెరుగుతుంది. ఎంతటివారైనా, ఎంతటి బంధం, బంధుత్వం ఉన్నా, గీత దాటానంతవరకే గీత దాటితే, ఎంతటి వారికైనా వాత తప్పదు. నరేంద్ర మొదలు ఈటల వరకు, ఎవరి కథ తీసుకున్నా అదే ముగింపు కనిపిస్తుంది. అయితే ఎర్రబెల్లికి ఆ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసిందో ఏమో కానీ నోరు జారారు. గీత దాటారు ముఖ్యమంత్రిని మెప్పించాలని అనుకున్నారో ఏమో కానీ, అనుమతి లేకుండా సర్వే నిర్వహించడమే కాకుండా, పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మీడియా ముందు మాట్లాడి భారాసలో ప్రకంపలు సృష్టించారు. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని కావచ్చు అబ్బే ... నేన్నది అది కాదు, మీడియా వక్రీకరించిందని తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు.
అయితే ఎర్రబెల్లి కుప్పి గంతులు ముఖ్యమంత్రి కేసేఆర్ దగ్గర పనిచేయలేదో ఏమో కానీ, ఎర్రబెల్లి కామెంట్స్‌పై కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అత్సుత్సాహం ప్రదర్శించవద్దని ఫోన్‌లో కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిధి దాటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంకోసారి అలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఎర్రబెల్లి చేత ఆ ప్రకటన చేయించారని, అయితే, అది కాస్తా లీక్ కావడంతో ముఖ్య మంత్రి సీరియస్ అన్న ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారని అంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టికెట్లు ఇస్తానంటూ గతంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలందరికీ టికెట్ కన్ఫామ్ అని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో.. అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం రేపాయి. కేసీఆర్ అందరికీ టికెట్లు ఖాయమని చెప్పగా.. ఎర్రబెల్లి ఎందుకు అలా కామెంట్స్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది.
ఎర్రబెల్లి కామెంట్స్ వెనుక కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఎర్రబెల్లికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారనే వార్తలతో ఆ ప్రచారానికి కాస్త తెరపడినట్లు అయింది. కానీ, అసలు కథ ఏమిటి? అంటే నిజానికి భారస ఎమ్మెల్యేలలో కేవలం 25మందికి కాదు, సగం మందికి పైగానే ఎమ్మెల్యేలు చిక్కుల్లో ఉన్నారు. మరో వంక పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యా పెరుగు తోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి ఎపిసోడ్ వన్ అండ్, టూ.. సీక్వెల్ ను తెరకెక్కించారని అంటున్నారు. అయితే ఏది నిజం ఏది కాదు అంటే, ఏమో ..ఎవరికీ తెలియదు.