బీఆర్ఎస్ తో పొత్తు .. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ?
posted on Jan 21, 2023 5:53AM
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం కేసీఆర్... తహతహ లాడుతున్నారా? ప్రస్తుత పరిస్థితిలో దేశం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ ‘చే’ తోడు అనివార్యమనే నిర్ణయానికి వచ్చారా? అంటే, అవుననే అంటున్నారు, అటూ ఇటూ ఉన్న ముఖ్య నేతల సన్నిహిత నాయకులు. నిజానికి ఇదేమి కొత్త విషయం కాదు. పొలిటికల్, మీడియా సర్కిల్స్ లో ఈ చర్చ చాలా కాలంగా జరుగుతూనే వుంది. ఇప్పుడు ఫ్రెష్ గా మరో మారు తెర మీదకు వచ్చింది.
ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్న నేపధ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ముఖ్య నేతలు కొందరు, అంతకు ముందు ఏంతో కాలంగా, తాము చేస్తూ వచ్చిన భారాస తో పొత్తు ప్రతిపాదనను మరో మారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆ తర్వాత ప్రత్యేక పరిశీలకునిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ద్వారా తమ ప్రతిపాదనను మరో మారు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటినుంచి ఢిల్లీ హైదరాబాద్ మధ్య ‘పొత్తు’ ప్రతిపాదన చక్కర్లు కొడుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధిష్టానికి ఇచ్చిన నివేదికలో భారాస, కాంగ్రెస్ పొత్తు ప్రస్తవన చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనక నడుస్తున్న రహస్య రాయబారాల వివరాలను బయట పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్‌తో కొట్లాడుతున్నప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సరెండర్ అయినట్లు ఉంటుందని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ని కలిశారని, ఆ తర్వాత రెండు రోజులకే నితీష్ కుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవాలని కోరినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని, లైట్‌గా తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, దయాకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు రావాలని గతంలో కాంగ్రెస్ జాతీయ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
ఎవరైనా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.ఆ తర్వాత పొత్తు వార్తలకు చెక్ పడగా.. ఇటీవల మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన రిపోర్టుతో మరోసారి చర్చ మొదలైంది. ఇదలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గ పోరును చల్లార్చేందుకు, అధిష్టానం దూతగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలంగాణలో బీజేపీ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. భారాస పొత్తుతో పోటీచేయడం వలన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటుంది.అదే ఒంటరిగా పోటీ చేసి ముక్కోణ పోటీలో ఇరవై పాతిక సీట్లు గెలిచినా, గత అనుభవాలను బట్టి చూస్తే గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గద్దల్లా ఎగరేసుకు పోవడానికి బీఆర్ఎస్ కు తోడు ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకోవాలని ఆయన హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, తొలి పర్యటనలో కొంత సమాచారం సేకరించిన తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మాణిక్‌రావు థాకరే, తాజా పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు విషయం పై కూడా ప్రత్యేక దృష్టి కేద్రీకరిస్తారని తెలుస్తోంది.