మోడీ ప్రచారయావ.. ఉద్యోగ నియామకాల్లోనూ గెలుపు లెక్కలే..
posted on Jan 20, 2023 @ 1:41PM
ప్రజా ధనంతో సొంత ప్రచారం చేసుకునే విషయంలో ప్రధాని మోడీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. స్వాతంత్ర్య భారత దేశంలో గత ఏడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న నియామక ప్రక్రియను కూడా తన ఘనతగా చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వివిధ శాఖలలో ఉద్యోగాల నియామకం ఒక నిరంతర ప్రక్రియ. ఆయా ఉద్యోగాలలో ఎంపికైన వారు తమ అర్హతను రుజువు చేసుకుని, అవసరమైన పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారే. వారికి హక్కుగా వచ్చే నియామకాలను కూడా ప్రధాని మోడీ ఇప్పుడు.. తన ఉదారత్వంగా చాటుకుని ప్రచారం పొందాలని చూస్తున్నారు.
ఇప్పటి వరకూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు (అప్పాయింట్ మెంట్ లెటర్స్) పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రోజ్ గార్ మేళా అని పేరు పెట్టి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామకపత్రాలను పంపిణీ చేసిన మోడీ.. ఇటువంటి మేళాల ద్వారా యువతకు సాధికారత లభిస్తుందన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టీచర్, నర్సు, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ స్టాఫ్ లకు మోడీ నియామక పత్రాలు అందజేశారు.
ఏడున్నర దశాబ్దాలలో గతంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదా? నియామక పత్రాలు అందుకోలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యే విధంగా మోడీ చేసిన ఈ హంగామా రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల ప్రయోజనాలు లక్ష్యంగా ఇటీవలి కాలంలో ప్రధాని మోడీలో ప్రచార యావ విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారం చేపట్టడానికి పూర్వం కూడా కోట్లాది మంది తమ అర్హతలను ప్రూవ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయినా అప్పటి ప్రభుత్వాలేవీ ఇలా అర్భాటంగా ప్రచార పర్వానికి తెరతీసిన దాఖలాలు లేవు. ఎన్నికలు గతంలోనూ జరిగాయి. కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇప్పటి మోడీ సర్కార్ లాగా ఒక పద్ధతి ప్రకారం..జరిగే నియామకాలను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్న దాఖలాలు వేవు.
ఉద్యోగ నియామకాల ప్రక్రియను పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. వాటి ద్వారానే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. ఆయా వ్యవస్థల ఆధ్వర్యంలోనే రాత పరీక్షలు జరుగుతాయి. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ వస్తాయి. ఇంటర్వ్యూలో కూడా అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇదీ నియామక ప్రక్రియ. ఆ విధంగా తమను తాము ప్రూవ్ చేసుకుని, రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామకపత్రాల పంపిణీ అంటూ మోడీ ఆర్భాటం చేయడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఆ తరువాత వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ప్రధాని మోడీ పార్టీ లక్ష్యమేమిటో ప్రకటించేశారు.
9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తీరాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఈ విజయాల ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో తాను మళ్లీ ముచ్చటగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఇదే బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యం అని విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే గత ఎనిమిదేళ్లుగా ఎన్నికల నుంచి ఎన్నికలకు అన్న టార్గెట్ తోనే ప్రబుత్వాన్ని నడుపుతున్న మోడీ సర్కార్ ఇక ఇప్పుడు పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.