ఆందోళన విరమించిన రెజ్లర్లు.. బ్రిజేష్ భూషణ్ పపైపోయినట్లేనా?
posted on Jan 21, 2023 @ 11:27AM
భారత రెజ్లర్ల తో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు ఫలించాయి. దీంతో గత మూడు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి విదితమే. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో శుక్రవారం (జనవరి 20) అర్ధరాత్రి ముగిసిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆందోళన విరమించారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సమాఖ్యలో ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణకు ముగ్గురు ప్రముఖ మాజీ క్రీడాకారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వారికి హామీ ఇచ్చారు. కమిటీలో ఇద్దరు మహిళలు ఉంటారని చెప్పారు. ఆ కమిటీని శనివారం (జనవరి 21)న ప్రకటిస్తారు. విచారణ పూర్తయ్యేంత వరకూ రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను కూడా కమిటీనే పర్యవేక్షిస్తుంది. మరోవైపు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత ఒలింపిక్ సంఘం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. భారత్ రెజ్లర్ల ఆందోళనకు కారణమైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు? రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎలా ఎంపికయ్యారు అంటే.. బీజేపీ ఎంపీగా ఆరు సార్లు గెలిచిన బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నరు.
2011 నుంచి ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సుమీత్ మాలిక్, బజరంగ్ పూనియా వంటి రెజ్లింగ్ హేమాహేమీలు ఇప్పుడు ఈయన దిగిపోవాలని.. ఈయన ఆధ్వర్యంలో సాగిన లైంగిక కాండలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మహిళా రెజ్లర్లు, మహిళా రెజ్లింగ్ శిక్షకులపై గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు రెజ్లింగ్ ఫెడరేషన్ క్యాంపులో రొటీన్ గా మారాయంటూ వినేష్ ఫోగట్ ఆరోపించారు. అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తనపై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అంటున్నారు.
గోండా, కైసర్ గంజ్, బలరాంపూర్ వంటి నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ కు విస్తృత రాజకీయ అనుభవం ఉంది. గోండా నివాసి అయిన బ్రిజ్ భూషణ్ తాను యువకుడిగా ఉన్నప్పుడు స్వయంగా కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. 1980ల్లో విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో చేరారు. హిందుత్వ ఇమేజ్ తో ఈయన చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. అయోధ్య రామ మందిర ఉద్యమ సమయంలో ఈయన పేరు మారుమోగింది కూడా. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. కానీ 2020లో కోర్టు నిరపరాధిగా ప్రకటించింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతోపాటు మరో 40 మందిపై అయోధ్య విషయంలో ఛార్జ్ షీట్ నమోదు కాగా వీరిలో బ్రిజ్ భూషణ్ కూడా ఒకరు.
దశాబ్దకాలంగా రెజ్లింగ్ ఫెడరేషన్ పై పట్టు బిగించిన ఈయన మంచి వక్త. ప్రస్తుతం 66 ఏళ్ల వయసున్న ఈయన తనపై వినేష్ ఫోగట్ వంటివారు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. వివాదం నేపథ్యంలో తాను బజరంగ్ పూనియాతో సహా చాలామందితో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికే ఆయన వివరణ కూడా ఇచ్చారు.