ఆహా మోడీ.. ఓహో మోడీ.. కేంద్రానికి కావల్సిందదేనా?
posted on Jan 20, 2023 @ 2:24PM
ప్రధాని మోడీకి ఎన్నికల లబ్ధి వినా మరేం కనిపించడం లేదా? ఆఖరికి గణతంత్ర దినోత్సవాలను కూడా ఎన్నికలలో లబ్ధి చేకూర్చే కార్యక్రమంలా మార్చేస్తారా? అంటే పరిస్థితులు గమనిస్తుంటే ఔననే అనాల్సి వస్తోంది. బడుగులకు పెద్ద పీట వేయాల్సిందే.. ఎవరూ కాదనరు. వారి ఆదాయం పెంపునకు మార్గాలు చూపాలి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక ఉత్సవానికి ముఖ్య అతిథిలను చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? కానీ మోడీ మాత్రం అలా చేస్తే చాలు ఓట్లు వాటంతటవే రాలుతాయని అంటున్నారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను బడుగులకు భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ థీమ్ తో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా గణతంత్ర స్ఫూర్తిని చాటుతున్నామని మోడీ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అంతే కాకుండా సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి వరుసలో కూర్చునే అవకాశాన్ని వీవీఐపీలకు ఇస్తారు. కానీ ఈ సారి బడుగుల భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్న ఈ గణతంత్ర దినోత్సవంలో మాత్రం ఆ అవకాశాన్ని రిక్షా కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల వేళ బడుగుల ఓట్లకు గాలం వేయడానికి మోడీ సర్కార్ వేసిన కొత్త ఎత్తుగడగానే దీనిని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో తోపుడు బండ్ల కార్మికులను ఆదుకోవడం కోసం అంటు ఘనంగా ప్రకటనలు గుప్పించినా ఆ తరువాత వారిని పూర్తిగా విస్మరించిన కేంద్రం ఇప్పుడు ఎన్నికల వేల ఓట్ల గాలం కోసం కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తోందంటున్నారు.
వీవీఐపీలకు కాకుండా రిక్షా కార్మికులు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులకు కేటాయించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. మొత్తం 45,000 మంది ఈ పెరేడ్ లో కూర్చునే సదుపాయం ఉంది. రాజ్ పథ్ రోడ్డును కర్తవ్యపథ్ గా పేరు మార్చాక జరుగుతున్ తొలి రిపబ్లిక్ డే పెరేడ్ ఇదే.