ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ తప్పదా?
posted on Jan 22, 2023 6:37AM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందనేది అందరికీ తెలిసిన రహస్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. అందుకే సంవత్సరం తిరగ కుండానే, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముందుచూపుతో వేసిన ఆర్థిక పునాదులు సడలి పోయాయి. అప్పుల వేట మొదలైంది.
కూచమ్మ కూడా బెడితే మాచమొచ్చి మాయం చేసింది అన్నట్లుగా పరిస్థితి తల్లకిందులైపోయింది ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోయారు. అప్పులు పుడితేనే కానీ పూట గడవని పరిస్థితికి రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. ముఖ్యంగా, సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన అనతరం అవశేష ఆంధ్ర ప్రదేశ్ లొ తొలి ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు వంటి అనుభవజ్ఞులు చేసిన సూచనలను కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోలేదు. బహుశా ఆయనకు సహజసిద్ధంగా అబ్బిన దురహంకారంతో కావచ్చును, మీటలు నొక్కుకుంటూ పోయారు.
ఫలితంగా ఇప్పడు ఇదిగో, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నట్లుగా జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చును. అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉంటే, ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయడంమంచిది. నిజానికి ఇదొక్క అశోక్ బాబు మాట కాదు. రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మొదలు, రాజ్యంగ నిపుణుల వరకు అందరూ అదే మాట అంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వక పోవడం, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో సర్కార్ చేతులు పెట్టడం, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ విషయంలో జరుగుతున్న జాప్యం, ఒకటి అని కాదు, ఇలా ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక వ్యవహారాల్లో జరుగతున్న అవకతవకలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా, ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఉత్తమం అంటున్నారు.
జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లోకూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. చెద పట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. 7వేలకోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలి ఉంది. గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వాన్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్రప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ డిక్లేర్ చేయాలని అంటున్నారు.