నితీష్ టార్గెట్ గా పీకే పొలిటికల్ ఎంట్రీ
posted on Jan 23, 2023 6:28AM
నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేదు. ఒకరు, కుర్చీలోంచి కదలకుండా అలవోకగా కూటములు మార్చడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రెండవ వ్యక్తి, ఒక దశాబ్ద కాలంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న, రాజకీయలలో ప్రముఖంగా వినిపిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం ఒకటైతే, ఇద్దరికిద్దరూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు.
అలాగే, ఇద్దరికిద్దరూ, రాజకీయాలను ఆవపోసన పట్టిన ఉద్దండ పిండాలు. అంతే కాదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి నిలువెత్తు నిదర్శనం ఈ బీహారీ జోడీ. రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఇద్దరికిద్దరూ అందె వేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. అఫ్కోర్స్, ఆ ప్రయత్నాలలో అన్ని వేళలా సక్సెస్ కాకపోవచ్చును, అయినా, ప్రయత్నాలు అయితే విరమించుకోలేదు. ఈ ఇద్దరి మధ్య, (ఇక్కడ అసందర్భమే అయినా) మరో సారూప్యం కూడా వుంది. ఈ ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావుకు మంచి మిత్రులు. మంచి శత్రువులు. అయితే ఇప్పడు విషయం అది కాదు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే ...
బీహార్ సీఎం నితీష్ కుమార్ 'సమాధాన్ యాత్ర' పేరిట బీహార్లో యాత్ర చేపట్టారు. మరో వంక, ఒకప్పుడు జేడీయు ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలు తన వంటికి పడవని ప్రకటించుకున్నారు. నేనొక విఫల రాజకీయ వేత్తనని చెప్పుకున్నారు. ఇక పై క్రియాశీల రాజకీయాల్లో వేలు పెట్టనని ప్రకటించుకున్నారు.అయితే, ఒపీనియన్ మార్చుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త అవతారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే, జన సూరజ్ యాత్ర పేరిట బీహార్ లోని చంపరాన్ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు.
అయితే, ఎవరి మానాన వారు ఎవరి యాత్ర వారు చేసుకుంటే ఏమో కానీ, ఒకప్పుడు జిగ్నీ దోస్తులుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇప్పడు మాటాల యుద్ధం నడుస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు చాల కాలంగా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రారంభించిన యాత్రపై ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు, బీహార్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తున్నాయి. పీకే విపక్ష్ల ఐక్యతకు గండి కొట్టే ప్రయత్నాలకు ఆయన శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు.
ప్రజలను మరోమారు మోసం చేసేందుకే నితీష్ యాత్ర చేపట్టారని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్ కిశోర్ కోరి కోరి కాలు దువ్వుతున్నట్లు ఉందని అంటున్నారు. నితీష్ గతంలో అనేక యాత్రలు చేసిన విషయాన్నిగుర్తు చేసిన ప్రశాంత్ కిషోర్.. వాటి వల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే నితీష్ ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు. అలాగే, రాహుల్ భారత్ జోడో యాత్రలో ముఖ్యమంత్రి నితీష్ పాల్గొనకపోవడంపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ యాత్రకు హాజరవుతున్నా, నితీష్ మాత్రం రాహుల్ యాత్రకు దూరంగా ఉన్నారని అన్నారు. 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ యాత్రపై ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నించారు.అలాంటప్పుడు ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అయితే, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను నితీష్ కుమార్ అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ, జేడీయు నేతలు మాత్రం ప్రశాంత్ కిశోర్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నితీష్ కుమార్ ని విమర్శించే ముందు, ప్రశాంత్ కిశోర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు. మరో వంకఎన్నికలు దగ్గరవుతున నేపధ్యంలో బీహార్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, అందులో ప్రశాంత్ కిశోర్ ఫాక్టర్ కుడా ఒకటి పరిశీలకులు అంటున్నారు.