వైనాట్ 175 కాదు.. కనీసం కడపలో టెన్ ఔటాఫ్ టెన్ అయినా సాధ్యమా?
posted on Jan 23, 2023 @ 10:53AM
రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయా? ఆది నుంచీ బలంగా ఉన్న రాయల సీమలో సైతం వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే విపక్షం ఔననే అంటేందు. సర్వేలూ పరిస్థితి అలానే ఉందని చెబుతున్నాయి. సీమకు చెందిన కొందరు వైసీసీ నేతలు సైతం జగన్ ఆటలు ఇంక సీమలో సాగే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నరు.
ఇదే మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్నారు. నిజంగానే సీమలో వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందా అంటే తాజాగా మాజీ మంత్రి, కపడ జిల్లా కమలాపురం వాసి వీరశివారెడ్డి కూడా ఔననే అంటున్నారు. వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని కుండబద్దలు కొట్టడమే కాదు.. రాయలసీమలోనూ, జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ ఆ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. వీర శివారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేశించారు.
మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరినా.. 2019లో ఆయన వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆయనే వైసీపీ పనైపోయిందని చెబుతున్నారు. ఆయనే కాదు.. సొంత పార్టీ అని కూడా చూడకుండా డీఎల్ రవీంద్రారెడ్డి కూడా జగన్ పనైపోయిందనీ, జనం ఆయనకు ఇచ్చిన ఒక్క చాన్స్ దుర్వినియోగం అయ్యిందనీ, మరో చాన్స్ అవకాశమే లేదని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఇరువురూ కూడా సీమలో చెప్పుకోదగ్గ బలం, పలుకుబడి ఉన్న నాయకులే. ఇరువురూ మాజీ మంత్రులే. వీరే కాకుండా పలువురు మాజీ ఎమ్మెల్యేలు.. అదీ రాయలసీమకు చెందిన వారే జగన్ పార్టీకి ఇక సీమలో కూడా చుక్కలే కనిపిస్తాయని చెబుతున్నారు. వీళ్లందరూ కూడా సైకిలెక్కే ఉద్దేశంతోనే వైసీపీ వ్యతిరేక గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ లైట్ గా తీసుకుంటోంది.
అయితే వీరే కాకుండా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా తెలుగుదేశం పలుకులే పలుకుతున్నారు. అంటే ఇప్పటికే సీఎం సొంత జిల్లా అయిన కడపలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులు జగన్ విజయం అసాధ్యమన్న రీతిలో ప్రకటనలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో కడప జిల్లాలో పది పది అసెంబ్లీ నియోజకవ్గాలలోనూ విజయం సాధించిన వైసీపీకి ఇప్పుడు నాటి హవా కొనసాగించడం అసాధ్యమనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.
అన్నిటికీ మించి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఈ సారి జగన్ కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకా హత్య, ఆయన కుటుంబాన్ని జగన్ దూరం పెట్టడం, వివేకా హత్య కేసులో అనుమానితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో జగన్ పట్ల వ్యతిరేకతను పెంచాయని అంటున్నారు. సీమలోనే వైసీపీకి వ్యతిరేక సెగలు ఉన్నాయంటే.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఆ పార్టీ మరింత గడ్డపరిస్థితిని ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.