యాత్రను అడ్డుకునే కుట్ర.. డీజీపీ లేఖే సాక్ష్యం!
posted on Jan 23, 2023 @ 11:18AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం ఇక రోజుల్లోకి వచ్చేసింది. 400 రోజుల పాటు సాగే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్లు సాగనుంది. ఇంతటి భారీ స్థాయిలో జరిగే యాత్రకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే యాత్రకు అనుమతి విషయంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచీ, పోలీసుల నుంచీ ఎటువంటి స్పందనా లేదు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రాష్ట్ర డీజీపీకి రాసిన రిమైండర్ లేఖపై స్పందించిన డీజీపీ అనుమతి ఇవ్వడానికి ముందు ఈ వివరాలు కావాలంటూ రాసిన లేఖలో ఆ వివరాలకు సంబంధించి కొండవీటి చాంతాడంత చిట్టా పొందుపరిచారు.
ఆ చిట్టా చూస్తే నారా లోకేష్ యాత్ర విషయంలో జగన్ సర్కార్ ఆడుతున్న తొండాట ఏమిటన్నది స్పష్టంగా తేలిపోతుంది. పొమ్మన లేక పొగపెడుతున్న చందంగా.. అనుమతి ఇవ్వడం ఇష్టం లేక వివరాల పేరుతో యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా సర్కార్ వ్యూహ రచన చేసినట్లు అవగతమౌతోంది. దీంతో తెలుగుదేశం అప్రమత్తమైంది. డీజీపీ అడిగిన వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతే కాకుండా నాడు గాంధీ పాదయాత్ర నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర వరకూ పాదయాత్రల వివరాలను పొందు పరిచింది. జగన్ పాదయాత్రకు అసలు ప్రభుత్వం నుంచి అనుమతే తీసుకోలేదన్న విషయాన్నీ ప్రస్తావించింది. ఇన్నీ ప్రస్తావించి అసలు పాదయాత్రకు డీజీపీ అనుమతి ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చేసింది.
సమాచారం ఇచ్చామనీ, ఇక నిర్ణయించుకోవలసింది.. ప్రభుత్వం, పోలీసులేనని తెలుగుదేశం స్పష్టం చేసింది. అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఒక ప్రభంజనంలా యాత్ర సాగి తీరుతుందని స్పష్టం చేసింది. లోకేష్ యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పటికే డీజీపీతో పాటుగా హోం శాఖ కార్యదర్శికి లేఖలు పంపారు. ఆ తరువాత హార్డ్ కాపీలను అందించారు. చిత్తూరు జిల్లా అధికారులకు లేఖలు రాసారు. సమయం సమీపిస్తుండటంతో మరోసారి అనుమతి పైన టీడీపీ నేత లేఖ పంపారు. దీని పైన డీజీపీ జిల్లాల వారీగా పాదయాత్ర సాగే రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. యాత్రలో పొల్గొనే వారితో పాటు వాహనాలు వివరాలు.. స్థానికంగా బాధ్యత తీసుకొనే వారి సమాచారం పంపాలని వర్లకు రాసిన లేఖలో డీజీపీ కోరారు. ఆదివారం డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖిత పూర్వకంగా వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు.
లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ తాము రాసిన లేఖపైన డీజీపీ స్పందనకు సమాధానంగా వర్ల రామయ్య పలు ప్రశ్నలు సంధించారు. గతంలో పాదయాత్రలు చేసిన వారిని ఎవరినైనా ఇవన్నీ అడిగారా అని ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ మరో లేఖ రాసింది. అందులో గాంధీ చేసిన యాత్ర నుంచి ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వహించిన పాదయాత్ర వరకు అన్ని అంశాలను ప్రస్తావించింది. తాజాగా డీజీపీ కోరిన వివరాలను అప్పట్లో వీరిని ఎవరూ అడగలేదని లేఖలో పేర్కొంది. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీలో కూడా కొంత దూరం పాదయాత్ర చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర కుప్పంలో ప్రారంభమై 125అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్ఛాపురం చేరుతుందని లేఖలో పేర్కొంది.
తాము ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా స్థానిక పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జగన్ పాదయాత్ర సందర్భంగా అప్పట్లో ఎటువంటి వివరాలు ఇవ్వలేదని టీడీపీ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది. జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ అప్పటి ప్రభుత్వానికి రాసిన లేఖను టీడీపీ బయట పెట్టింది. ఇప్పుడు డీజీపీ అడుగుతున్న వివరాలేవీ అప్పుడు జగన్ ఇవ్వకపోయినా ఆయన పాదయాత్రకు తాము అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించామని టీడీపీ వెల్లడించింది. ఆంక్షలు, అనుమతుల పేరిట ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నిటినీ ఛేదించుకుని లోకేష్ పాదయాత్ర కొనసాగి తీరుతుందని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.