రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. మర్యాద గీత దాటేసిన విభేదాలు
posted on Jan 24, 2023 @ 12:06PM
వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది. గత మూడున్నరేళ్లుగా గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి. రోజు రోజుకూ రాజుకుంటూనే ఉన్నాయి. గత మూడున్నరేళ్లుగా ఇరువురూ అనివార్యమైన ఒకటి రెండు సందర్భాలలో వినా ముఖాముఖీ భేటీ అయిన దాఖలాలు లేవు. ఈ ఇరువురి మధ్యా విభేదాల ప్రభావం జాతీయ పండుగలపైనా పడుతోంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవాలు ఈ సారి రాజ్ భవన్ కు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సైతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశం కూడా కనిపించడం లేదు.
అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు. ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి తనకుఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై వివరించారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని, తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నా.. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని మౌనంగా ఉంటున్నట్లు తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి అన్నారు. అంతే కాదు.. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది. రిపబ్లిక్ డే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరే చూస్తారుగా.. వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సర్కార్ ఏ మాత్రం సిద్ధంగా లేదన్నది తేటతెల్లమౌతోంది.