నాట్ టుడే.. అనదర్ డే.. సీబీఐ నోటీసులకు ఎంపీ అవినీష్ రెడ్డి జవాబు
posted on Jan 24, 2023 9:29AM
వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి మంగళవారం (జనవరి 24) హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాష్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు. అయితే మంగళవారం తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు మరో తేదీని విచారణకు నిర్ణయించాల్సిందిగా అవినాష్ రెడ్డి సీబీఐను కోరారు. అదలా ఉంటే..
వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు కోర్టు ఆదేశాల మేరకు మార్చిన తరువాత సీబీఐ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసిన సంగతి విదితమే.
గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తి అయిన సీఎం జగన్ ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు.
ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ పదే పదే చెప్పడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి.
సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అను మానాస్పదస్థితిలో మరణించడం, అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసింది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడి తెలంగాణకు బదలీ చేసింది.