సీట్ల సర్దుబాటుపైనే ఇప్పుడు దృష్టంతా?
posted on Jan 24, 2023 5:05AM
జనసేన తెలుగుదేశం పొత్తు పై ఇక ఇప్పుడెవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. జనసేన సీనియర్ నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పొత్తు ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేశారు. వైసీపీని గద్దె దించాలంటే పొత్తులు తప్పవని ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం, ఆ తరువాత సీట్ల సర్దుబాటుపై నాగబాబు సంకేతాలివ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ సాగుతోంది. ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 40-50 స్థానాలపై జనసేన డిమాండ్ చేస్తున్నట్లుగా ఇరు పార్టీలలోనూ చర్చ అయితే జరుగుతోంది. కానీ చివరకు పాతిక సీట్లతో జనసేన సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ సీట్లన్నీ కూడా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నుంచీ ఎటువంటి ప్రకటనా రాకముందే.. తెలుగువన్ ఈ నెల 5వ తేదీనే జనసేన- తెలుగుదేశం పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి అన్న శీర్షికన ప్రత్యేక కథనంలో పేర్కొంది. పొత్తులో జనసేన పార్టీకి ఏడు జిల్లాల పరిధిలో 20 సీట్లు కేటాయించేందుకు తెలుగుదేశం అంగీకరించిందనీ, ఈ మేరకు ఇరు పార్టీల మధ్యా అవగాహన కూడా కుదిరిందనీ ఆ కథనం లో వెల్లడించింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై జనసేనాని నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడమే కాకుండా.. ఎవరూ ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని తేటతెల్లమైపోయింది. తెలుగువన్ చెప్పినట్లు ఏడు జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఆరంభమైంది. ఇవి కాక మరి కొన్ని స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకూ గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, చిత్తూరు,కర్నూలు జిల్లాలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందని చెబుతున్నారు. విజయనగరం, అనంతపురం జిల్లాల విషయంలో చర్చలు సాగుతున్నాయంటున్నారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది. ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది.
ఏతా వాతా ఈ పొత్తు కారణంగా జనసేన, తెలుగుదేశం కూడా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించడం అంటే.. ఆయా స్థానాలలో ఇంత కాలం అధికార వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన కొందరు నాయకులు తమతమ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన స్ధానాల జనసేన త్యాగం చేయాల్సి ఉంటుంది.
మొత్తం మీద తెలుగుదేశం అధినేత ఇప్పటికే ఓ పాతిక స్థానాలను జనసేనకు కేటాయించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు 2019 ఎన్నికల ఫలితాలను బేస్ గా చేసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఉండాలంటే.. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు అవసరం. ఇరు పార్టీలకూ కూడా అది అవసరం. అందుకే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పుపై జరుగుతున్న చర్చలో బీజేపీ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు.అందుకే వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య మైత్రీ బంధం తెగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.