జగన్ సర్కార్ పై కేంద్ర మంత్రుల విమర్శలు.. చర్యలు తప్పవన్న హెచ్చరికలు
posted on Jan 24, 2023 @ 3:19PM
నిండా మునిగిన వాడికి చలేమిటన్నది నానుడి. జగన్ ప్రభుత్వానికి సిగ్గు లేదని.. నిత్యం ఆయన సర్కార్ పై వెల్లువెత్తుతున్న విమర్శలకు ఇసుమంతైనా స్పందించని ఆయన తీరును చూసిన వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో విపక్షాలే కాదు.. అడుగడుగునా జగన్ కు సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిథులు సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర పర్యటనకు ఏ కేంద్ర మంత్రి వచ్చినా.. రాష్ట్రంలో పరిస్థితి చూసి నోరేళ్ల బెడుతున్నారు.
ఇంతటి అధ్వాన పరిపాలన ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రాదని జోస్యం చెబుతున్నారు. ఒక్క లోక్ సభ స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ కూడా అదే అన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పూర్తిగా చతికిల పడింద. మొత్తం మీద ఏపీలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. అర్ధిక క్రమశిక్షణ పూర్తిగా కట్టు తప్పింది. ఆర్థికంగా దివాళా అంచుకు చేరింది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తోంది.
కేంద్రం నిధులతో చేపట్టిన పనులను కూడా తన ఖాతాలోనే వేసేసుకుంటోంది. ఎక్కడా కేంద్రం పేరు ప్రస్తావించడం లేదు. కేంద్ర పథకాలకు కూడా జగన్ ఫొటోనే వాడుతోంది. మోడీ బొమ్మే కనిపించడం లేదు. ఇవి సాక్షాత్తూ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చేసిన విమర్శలు. ఆయన కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇంత కాలం రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలనే మరో మారు చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం అప్పగిస్తే.. ప్రజల నమ్మకాన్ని అతి తక్కువ సమయంలోనే జగన్ ప్రభుత్వం కోల్పోయిందని దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు.
కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన ఫైనాన్స్ కమిషన్ నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని విమర్శించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది జగన్ సర్కార్ తీరు అప్పు చేసి పప్పుకూడు తింటున్న చందంగా ఉందని విమర్శలు గుప్పించారు. సుపరిపాలన అందించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారనీ, ఆయన పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని దేవుసిన్హా చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో గ్రామాభివృద్ధి అడుగంటిపోయిందనీ, గ్రామస్వరాజ్యం అన్న పూజ్య గాంధీజీ బాటలో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రణాళికా సంఘం సిఫార్సుల మేరకు కేటాయిస్తున్న నిథులను దారి మళ్లించి గ్రామ స్వరాజ్య లక్ష్యానికి తూట్లు పొడుస్తోందంటూ జగన్ సర్కార్ పై ఆమె నిప్పుల వర్షం కురిపించారు. ఇక ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల పాట్లు చెప్పనలవి కావని అన్నారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు అందక ఉద్యోగులు, పెన్షనర్లు నానా అగచాట్లూ పడుతున్నారన్నారు. కేంద్రం రాష్ట్రానికి 20లక్షల గృహాలను కేటాయించిందనీ.. కానీ జగన్ సర్కార్ ఒక్కటంటే ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదనీ కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ విమర్శించారు. పేదలకు ఆయుష్మాన్ కార్డులు అందించలేదు.
ఇక విజయవాడలో జరిగిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లో భాగంగా విజయవాడ శివారులో నిర్మించిన ఆస్పత్రిని మరో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి లోపలికి వెళ్తూంటే వైసీపీ కార్యాలయంలోకి వెళుతున్న భావన కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ లోగోను గానీ, ప్రధాని మోదీ ఫొటోలను ప్రదర్శించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారుల బృందం వచ్చి విచారణ చేస్తారని.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తామని హెచ్చరించారు.
మొత్తంగా కేంద్రం అండ ఉందని భావిస్తూ చిత్తం వచ్చినట్లుగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు కేంద్ర మంత్రుల నుంచీ అక్షింతలు తప్పడం లేదు. సొంత పార్టీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న అసంతృప్తి, ఆగ్రహాం, కేంద్రం కన్నెర్ర చేయడం, విపక్షాల జోరు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.