కమలానికి కన్నా గుడ్ బై
posted on Jan 24, 2023 @ 2:07PM
భారతీయ జనతా పార్టీ, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్నారా? ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారా? కొనసాగుతారా? అంటే అనుమానమే అంటున్నారు అయన సన్నిహితులు. నిజానికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నది మొదలు, కన్నాపార్టీ వ్యవహారాలకు కాసింత దూరంగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.
నిజానికి ఒక్క కన్నానే కాదు, రాష్ట్ర విభజన తర్వాత కట్టకట్టుకుని కాషాయం కట్టి, కమల దళంలో చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు చాలావరకు 2019 తర్వాత సైలెంట్ అయిపోయారు. ఒక్క పురందేశ్వరి మాత్రమే కొంతలో కొంత ఆక్టివ్ గా ఉన్నారు. ఆమె కూడా పార్టీలో ఎంతకాలం ఉంటారనేది అనుమానమే అంటున్నారు. నిజానికి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇటీవల రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె కూడా అదే బాటలో క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేదు. పోనీ కాంగ్రెస్ లోకి వెళదామంటే ఆ పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా వుంది. అందుకే ఆమె, క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగి బీజేపీలో కొనసాగడమా, లేక మరో ప్రాంతీయ పార్టీలో చేరడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు.
సరే, పురందేశ్వరి విషయం ఎలా ఉన్నా, కన్నా లక్ష్మీనారాయణ అయితే బీజేపీకి కటీఫ్ చెప్పినట్లే అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. అలాగే మంగళవారం(జనవరి 24) భీమవరంలో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కన్నా డుమ్మా కొట్టారు. బీజేపీ నేతలంతా భీమవరంలో ఉంటే కన్నా హైద్రాబాద్ లో ఉన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన హైద్రాబాద్ కు వచ్చినట్టుగా కన్నా వర్గీయులు చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కన్నా కమలాన్ని వీడినట్లేనని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే గత డిసెంబర్ చివర్లోనే, కన్నాలో కదలిక మొదలైంది. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అప్పట్లో అదేమీ లేదు. పాత మిత్రులం కదా, అందుకే, అలా ఓ సారి కబుర్లు చెప్పుకున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని ఇద్దరు నేతలు అప్పట్లో చెప్పుకొచ్చారు, అఫ్కోర్స్, ఆ మాటలు ఎవరూ నమ్మలేదను కోండి అది వేరే విషయం. అందుకే, అప్పట్లోనే జనసేనలో కన్నా లక్ష్మీనారాయణ చేరుతారని ప్రచారం స్పీడ్ అందుకుంది.
నిజానికి కన్నా సోము మధ్య చాలా కాలంగా ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది. కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు ఇటీవల తొలగించారు. దీంతో అంతవరకూ కొంత గుంభనంగా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు జనసేనతో నామమాత్రంగా సంబంధాలు ఉండడానికి సోము వీర్రాజ వైఖరే కారణమని కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే తప్పుబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.
ఈనేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇప్పడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఇక ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. ఏ పార్టీ, ఎప్పడు చేరుతున్నారు అనేది మాత్రమే తేలవలసి ఉందని అంటున్నారు. అదలా ఉంటే, ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు నిన్ననే కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కన్నాకు సూచించినట్టుగా కన్నా వర్గీయులు చెబుతున్నారు. అయితే, కన్నా ఒక నిర్ణయానికి వచ్చారని, త్వరలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. అదే జరిగితే, ప్రస్తుతం బీజేపీలో ఉండీ లేనట్లున్న మరి కొందరు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడం ఖాయమని అంటున్నారు.