ఏ క్షణంలోనైనా ఎంపి అవినాష్ అరెస్ట్?
posted on Jan 24, 2023 @ 1:30PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కోరినట్లుగా మంగళవారం (జనవరి 24)న విచారణకు హాజరుకాలేననీ, బిజీ షెడ్యూల్ ఉందనీ పేర్కొంటూ.. మరో రోజు విచారణకు హాజరౌతాననీ, అందుకు ఐదు రోజులు గడవు కోరుతూ సీబీఐకి బదులిచ్చారు.
అయితే అవినాష్ సమాధానంతో సంతృప్తి చెందని సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పులివెందుల వెళ్లేందుకు అదనపు భద్రత కావాలంటూ సీబీఐ కడప ఎస్పీని, ఇతర ఉన్నతాధికారులను కోరింది. దీంతో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారులు.. కడప నుంచి ఇప్పటికే పులివెందులకు బయలు దేరారు. భారీగా భద్రతతో సీబీఐ బృందం పులివెందులకు బయలుదేరడంతో.. అవినాష్ ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సందర్బంలో కేసు దర్యాప్తునకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుతగులుతున్నారంటూ సీబీఐ సర్వోన్నత న్యాయ స్థానానికి నివేదించిన సంగతి విదితమే. ఇప్పడు సుప్రీం ఆదేశాలతో కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన అనంతరం సీబీఐ దర్యాప్తుజోరు పెరిగింది.
మొదటి నుంచీ ఈ కేసు విచారణను నీరుగార్చడానికి పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి. వివేకా హత్య జరిగినప్పుడు గుండెపోటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి , ఆ తరువాత గొడ్డలి పోటని తేలిన తరువాత అప్పటి ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించి, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన న జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో న్యాయపోరాటం చేసి సీబీఐ విచారణకు కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చేలా చేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అవరోధాలు కలిగేలా అధికార పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ.. కేసును వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించారు.
ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కూడా సునీత పేర్కొన్న ప్రతి అంశం అక్షర సత్యమని సుప్రీం కు తెలియజేసింది. దీంతో కేసును తెలంగాణకు సుప్రీం బదలీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ అరెస్టు అనివార్యమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. పులివెందులకు భారీ భద్రతతో పయనమైన సీబీఐ అధికారులు అవినాష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.