ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఔట్
posted on Jan 24, 2023 5:41AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది. డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా... జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1996 బ్యాచ్ కు చెందిన సంజయ్ ను ఏపీ సీఐడీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.
జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన హయాంలో.. సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే పని చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి వచ్చి నిండా నెలరోజులు కూడా కాలేదు. అంతలోనే హఠాత్తుగా ఆయనపై బదిలీ వేటు పడింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న సునీల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్ జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ సహా పలు కేసులలో సీఐడీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయిన దానికీ, కాని దానికీ విపక్ష నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికే సీఐడీ పని చేస్తోందా అన్నట్లుగా సునీల్ ఆధ్వర్యంలో సీఐడీ పని చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విపక్షాలను వేధించడం కోసమే అన్నట్లుగా సీఐడీ వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్ గా సునీల్ వ్యవహార శైలిపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు.. సరికదా ప్రొత్సహించింది. అలాంటిది ఏపీ సీఐడీ చీఫ్ గా ఆయనను హఠాత్తుగా బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడం విస్మయం గొలుపుతోంది. దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.