వైసీపీ ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బింది.. రఘురామకృష్ణం రాజు
posted on Feb 16, 2023 @ 9:39AM
నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది.. ఆ మాటలతో మాట్లాడిన వారికేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రాజధాని విషయంలో అధికార వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులు మాట్లాడుతున్న మాటలు. ఏ నిముషానికి ఎవరేం మాట్లాడతారో తెలియక ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎవరు చెప్పింది నమ్మాలో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి.
పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నోరు మెదకపోవడం చూస్తుంటే.. ఈ గందరగోళ వ్యాఖ్యల వెనుక ఏదో వ్యూహం ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ తీరు రాజధాని విషయంలో అయోమయం సృష్టించి పబ్బం గడుపుకోవడమే ఆ వ్యూహం అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అన్నది మిస్ కమ్యూనికేషన్ అని, విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెబితే.. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జగన్ మూడు రాజధానుల కు కట్టుబడి ఉన్నారని చెబుతూ.. అయితే రాజధాని అన్న పేరు లేకపోవచ్చు కానీ విశాఖతో పాటు అమరావతి, కర్నూలు కూడా రాజధానులేనని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని చెప్పి, వాటినీ అభివృద్ధి చేస్తామనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
బుగ్గన ఏ సందర్భంలో విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పాలో తెలియదని.. వైజాగ్ లో సచివాలయం, అమరావతి లో అసెంబ్లీ, కర్నూలులో హై కోర్ట్ కర్నూలు ఇదే మా విధానం అని మీడియాకు చెప్పారు. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ప్రభుత్వం న్యాయరాజధాని అనేదే లేదని విస్పష్టంగా చెప్పేసింది. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బుగ్గన, అంతకు ముందు ఢిల్లీలో సీఎం జగన్ విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని విస్పష్టంగా చెప్పారు. రోజుల వ్యవధిలో పార్టలోని ముగ్గురు కీలక నేతల నోటి వెంట రాజధాని విషయంలో వచ్చిన ఈ భిన్న ప్రకటనలు దేనికి సంకేతం? పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని, తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుంది కానీ, బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు లు చెప్పిన విధంగా కాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా స్థిరత్వంలో అస్దిరత్వం అన్న వింత విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణం రాజు. రచ్చబండలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 15) మీడియతో మాట్లాడిన రఘురామరాజు రాజధాని విషయంలో మంత్రుల మాటలు చూసి ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అంటున్నారని ఆయన అన్నారు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖాలు ద్వారా, అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలను చూసి, అమరావతి రైతులు నవ్వుకోవాలి తప్పితే, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఓటమి భయంతో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.