మృత్యువుతో పోరాటంలో అలసి ఒరిగిన తారకరత్న!
posted on Feb 18, 2023 @ 10:02PM
ఆశలు ఆవిరి అయిపోయాయి. తీవ్ర గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న కన్నుమూశారు. వైద్యానికి స్పందిస్తున్నారనీ, ఆయన తప్పకుండా కోలుకుంటారనీ అంతా భావించారు. వైద్యులు కూడా తారకరత్న ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేననీ, అయితే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ చెప్పారు. అయితే అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. దీంతో నందమూరి కుటుంబం, తారకరత్న అభిమానలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
కుప్పంలో గత 27ర తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను బతికించేందుకు వైద్యులు బ్రహ్మ ప్రయత్నమే చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దాదాపు 22 రోజులకు పైగా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం (ఫిబ్రవరి 18) సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల 27న గుండెపోటుకు గురైన వెంటనే ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న బాబాయ్, టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రి వద్దే ఉండి అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. తొలుత ఎక్మో అమర్చి చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం కొంచం మెరుగుపడగానే ఎక్మో తొలగించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు.
ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆయన లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గత నెల 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల కార్యక్రమంలోనూ, అనంతరం మసీదులో ప్రార్ధనలలోనూ కూడా తారకరత్న పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో అడుగు కదిపారు. నడుస్తుండగానే ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలిపోయారు. బెంగళూరు నాయారణ హృదయాలయ ఆసుపత్రిలో తొలి రెండు రోజులూ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత ఆయన చికిత్సకు స్పందిస్తున్నారనీ, ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు.
ఆ మేరకు హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. గుండె సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయాయనీ, అయితే మెదడు డ్యామేజి కావడంతో ఆ చికిత్స చేస్తున్నామనీ వైద్యులు తెలిపారు. శుక్రవారం (ఫిబ్రవరి 17)కూడా తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆయన పూర్తిగా కొలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే అంతలోనే శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించడంతో కన్నుమూశారు.