కన్న బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కిలోమీటర్లు.. అంబులెన్స్ సౌకర్యం కల్పించని కేజీహెచ్ అమానవీయం
posted on Feb 16, 2023 @ 5:45PM
జగన్ పాలనలో సర్వ వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవత్వం అన్నది మచ్చుకైనా కనిపించని పరిస్ధితి నెలకొంది. అసలు జనగ్ పాలనలో జవాబుదారీ తనమై కరవైందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. జనం ప్రశ్నిస్తున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆందోళనకు దిగినా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఒక అమానవీయ ఉదంతం గురించి తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ గురువారం ( ఫిబ్రవరి 16) చెప్పారు. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఓ చిన్నారి మరణిస్తే.. ఆమె మృత దేహాన్ని అక్కడ నుంచి స్వస్థలమైన పాడేరుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాళ్లు పట్టుకుని అడిగినా కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, అవమానించారనీ ఆ పాప తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక విశాఖ నుంచి పాడేరుకు 120 కిలోమీటర్ల దూరం తన కన్న బిడ్డ మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెళ్లారు. ఈ దయనీయ సంఘటన చూసిన వారందరికీ కంట నీరు తెప్పించింది.
ఈ సంఘననే లోకేష్ చెప్పారు. ఆ పాప తల్లిదండ్రుల దయనీయ స్థితి వింటున్న తనకు కన్నీరు వచ్చిందనీ, అందరి చేతా కంటనీరు పెట్టించిన ఉదంతం అధికారంలో ఉన్న పబ్జీ ప్లేయర్ జగన్ ను మాత్రం కదిలించలేకపోయిందని విమర్శించారు. రోమ్ నగరం తగలడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తే బెటర్ అన్నట్లుగా జగన్ తీరు ఉందని దుయ్యబట్టారు. పూటకో అమానవీయ ఘటన, రోజుకో దయనీయ దృశ్యం జగన్ పాలనలో నిత్యకృత్యంగా మారిపోయాయన్నారు. ఇక కేజీహెచ్ లో మరణించిన చిన్నారి విషయానికి వస్తే.. అనారోగ్యంతో ఆ పాప మరణించింది వాస్తవమే.
అయితే ఆ పాప అనారోగ్యం ఏమిటన్నది కూడా ఆసుపత్రి వర్గాలు కానీ, వైద్యులు కూడా చెప్పలేదు. ఆ పాప తల్లి దండ్రులు మాత్రం ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ రక్త నమూనాలు సేకరించారనీ, అయితే మా పాప అనారోగ్యం ఏమిటన్నది కానీ, రోజూ రక్త నమూనాలు ఎందుకు సేకరిస్తున్నారని కానీ తమకు మాటమాత్రం చెప్పలేదని ఆ పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.