బీహార్ సీఎం నితీష్ యూటర్న్.. ప్రశ్నార్థకంగా విపక్షాల ఐక్యత?
posted on Feb 16, 2023 9:03AM
సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ విపక్షాల ఐక్యతారాగం శృతి తప్పుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయి.. కేంద్రానికి వ్యతిరేకంగా తమతమ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ప్రయత్నాలు కూడా షురూ చేశాయి.
అయితే బీజేపీయేతర పార్టీలలో సైద్ధాంతిక విభేదాలను పక్కన పెడితే.. ఆయా పార్టీలలో పరస్పర విశ్వాసం, నమ్మకం కొరవడిన పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాల ఐక్యతకు కెటలిస్టుగా ఉంటారనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు.. విపక్షాల ఐక్యతకు పెద్ద అవరోధంగా మారాయి. నితీష్ కుమార్ అమిత్ షా ల మధ్య ఫోన్ సంభాణన కు సంబంధించి వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్ఠిస్తున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి గత ఏడాది బయటకు వచ్చి.. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన నితీష్ అంతలోనే ప్లేట్ ఫిరాయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో బీహార్ సీఎం కమలం గూటికి చేరేందుకు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదుగా మారింది.
కేంద్రం ఇటీవల 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిచిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీహార్ కూ కొత్త గవర్నర్ ను నియమించింది. బీహార్ కొత్త గవర్నర్ గా విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ నియమితులయ్యారు. ఇంత వరకూ బానే ఉంది. బీహార్ కు కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నితీష్ కుమారే మీడియాకు చెప్పారు. ఇక్కడే నితీష్, బీజేపీల కుమ్మక్కు అనుమానాలు వెల్లువెత్తాయి.
బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఫోన్ చేసి మరీ బీహార్ సీఎంకు చెప్పారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పైగా నితీష్ కుమార్ బీజేపీకి ఆషామాషీగా గుడ్ బై చెప్పలేదు. తన నేతృత్వంలో బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి, తాను స్వయంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీకి బద్ధ శత్రువైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో మహాఘట్ బంధన్ పేర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని రాజకీయ వర్గాలలో చర్చ జోరందుకుంది.
బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఐక్యత కోసం నితీష్ కుమార్ స్వయంగా జాతీయ స్థాయిలో పలువురు నేతలను కలిశారు. అవి ఎంత వరకూ సఫలమయ్యాయన్న విషయాన్ని పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేందుకు బీజేపీ నితీష్ కుమార్ ను మళ్లీ కమలం గూటికి అంటే ఎన్డీయేలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నితీష్ కుమార్ విషయంలో విపక్షాలలో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే నితీష్ కుమార్ పరిస్థితులను బట్టి దోస్తానీ, కటీఫ్ లు చెప్పడంలో ఆరితేరిన దిట్ట అన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్‌కు అమిత్ షా కాల్ పట్ల బీజేపీయేతర పార్టీల నేతలలో శంక మొదలైంది. అయితే జేడీయూ అధికార ప్రతినిథి మాత్రం నితీష్ మళ్లీ ఎన్డీయే గూటికి అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. నితీష్ కుమార్, జేడీయూ సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నాయన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం నితీష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు.