సోమేష్ కు ప్రభుత్వంలో కీలక పోస్టు.. కేసీఆర్ నిర్ణయం
posted on Feb 16, 2023 @ 1:44PM
ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగా నే జరిగింది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన గత నెల 12న అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేశారు. అయితే అప్పుడే ఆయన స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. వాస్తవానికి సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ గత నెలలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద విరమణకు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది.
అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ గత నెల 12న ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి, తేదా బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు..
తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఎం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారనీ, అందుకోసమే ఇప్పటికే ప్రస్తుతం సెక్రటేరియెట్ గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోనే సోమేష్ కోసం ఛాంబర్ రెడీ అవుతోందని అధికారులలో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్‌శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్‌కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా కేసీఆర్ నియమించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.