పశ్చిమ బెంగాల్.. అయినా పరిస్థితులు మారలేదు!
posted on Feb 17, 2023 @ 11:11AM
పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ మారినా.. పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు కనిపించలేదు. గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. పాత గవర్నర్ స్థానంలో కొత్త గవర్నర్ వచ్చినా ప్రభుత్వం- గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది. గవర్నర్ గా జగదీప్ ధనకర్ ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యమూ ఘర్షణ పూర్వక వాతావరణమే కనిపించేది. గవర్నర్ ధన్‌కడ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య సఖ్యత సంగతి పక్కన పెడితే నిత్యం ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ ఉండేవారు.
ధన్ కడ్ గవర్నర్ గా ఉన్నంత కాలమూ.. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఇరువురి మధ్యా సామరస్యపూరిత వాతావరణం ఉన్న దాఖలాలు లేవు. అయితే మమతకు ఊరట కలిగించేలా ధన్ కడ్ ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్ బాధ్యతలు స్వీకరించారు. ధన్ కడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించిన తీరు కారణంగానే మోడీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారని పరిశీలకుల విశ్లేషణలు పక్కన పెడితే ఆయన రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో మమత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పారు. ఆయన స్థానంలో 1977 ఐఏఎస్ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మోడీ ఏరి కోరి ఎంపిక చేసి మరీ పంపించారు. గత ఏడాది నవంబర్‌లో సీవీ ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో గవర్న్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య సుహృద్భావ పూరిత వాతావరణమే ఉండింది.
మమత రచనలు, పెయింటింగ్లు, సంగీత కంపోజిషన్లు, అల్బమ్ లపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మమతా బెనర్జీ సైతం ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన రసగుల్లాలను బహుమతిగా ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మమత ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని ఇటీవలి బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆనంద్ బోస్ అక్షరం పొల్లుపోకుండా చదివారు. ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్ ఈజీఏ, పీఎంఏవై నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ ఉన్న భాగాలను కూడా ఆయన అక్షరం పొల్లుపోకుండా చదివేశారు.
అయితే ఇటీవల ఆయన వైఖరి మారింది. అందుకు కారణం ఆయన వ్యవహార శైలి పట్ల కేంద్రం కన్నెర్ర చేయడమేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ గవర్నర్ లో భేటీ అయ్యారు. వీరి మధ్య ఈ భేటీ దాదాపు రెండు గంటలకు పైగా జరిగింది. సాధారణంగా గవర్నర్ అంత సేపు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ తరువాత నుంచే గవర్నర్ వైఖరిలో మార్పు వచ్చిందని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
ఆ భేటీ తరువాత లోకాయక్త నియామకం విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం సైతం చేయలేదు. పైగా లోకాయుక్త నియామకం ఉత్తర్వులలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని ఆరోపణలు సైతం చేశారు. ఆ వెంటనే తనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన నందినీ చక్రవర్తికి గవర్నర్ ఉద్వాసన పలికారు. దీంతో పశ్చిమ బెంగాల్ లో గవర్నర్- ప్రభుత్వం మధ్య సంబంధాలు మళ్లీ మొదటికి చేరుకున్నాయి.