అలో లక్ష్మణా అంటున్న ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు
posted on Feb 16, 2023 @ 4:33PM
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులమయ్యాం అని సంబరపడినంత సేపు పట్టలేదు వారికి తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని తెలుసుకోవడానికి. తమది ప్రభుత్వ ఉద్యోగం కాదు వెట్టి చాకిరీ అని వారు ఇప్పడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించగానే సంబరాలు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉన్న సదుపాయాలు కోల్పోయి కుడితిలో పడ్డ ఎలుకలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగం వస్తే ఇక జీవితం సెటిల్ అయినట్లే అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అలాగే సంబరపడ్డారు. గత ఏడాది ఆర్టీసీని ఏపీ సర్కార్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించేసింది. ఇంకే ముంది తమ జీవితాలు ధన్యమైపోయినట్లేనని ఆర్టీసీ ఉద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ కు క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు అప్పట్లో చేసిన ఆందోళన కు కూడా వారు దూరం జరిగారు. అయితే ఆ తరువాత కానీ వారికి తత్వం బోధపడలేదు.
జగన్ సర్కార్ తమకు అర చేతిలో వైకుంఠం చూపి నిలువునా ముంచేసిందని. ఆర్టీసీ పేరుకే ప్రభుత్వ సంస్థ కానీ, ఆ సంస్థలో ఉద్యోగులకు మాత్రం గతమే మేలు అని ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పట్లో పేరుకే కార్పోరేషన్ ఉద్యోగులం కానీ.. తమకు రావలసిన వేతనాలు, వేతన బకాయిలు, టీఏలు, డీఏలు సమయానికి వచ్చేవనీ, ఏటేటా ఇంక్రిమెంట్లూ సవ్యంగా దఖలు పడేవనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ఆర్టీసీ కార్పోరేషన్ గా ఉన్నప్పుడు ఉద్యోగులకు క్రమం తప్పకుండా రాయతీలు, అలవెన్సులూ అందేవి. ఇప్పడు ప్రభుత్వంలో విలీనం పేరు చెప్పి వాటిని నిలిపివేసింది జగన్ సర్కార్. అంతేనా ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం చేసిన ఆందోళనలో పాల్గొనకుండా ప్రబుత్వానికి మద్దతుగా నిలిచినందుకు బోనస్ గా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగిడంతో ఇక తప్పదన్నట్లుగా జగన్ సర్కార్ గత ఏడాది జూన్ లో పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ ఆ పెరిగిన వేతనాలు ఆర్టీసీ ఉద్యోగులకు రెండు నెలల తరువాత కానీ అందలేదు. అయితే గత ఆరు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీ, ఇతర అలవెన్సులనూ సర్కార్ నిలిపివేసింది. పోనీ ఓటీలు చేయడం మానేద్దామా అంటే వస్తున్న జీతం చాలదు. అయినా ఓటీ చేసినా డబ్బులు రావడం లేదు కనుక మానేద్దామంటే ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే ఆర్టీసీలో గత పదేళ్లుగా కొత్త నియామకాలు లేవు. దీంతో రిటైరైన వాళ్లు రిటైరైపోతున్నారు. ఆ పని భారం కూడా ఉన్న వారి మీదే పడుతోంది. దీంతో నిబంధనల ప్రకారం డ్యూటీ టైం 8 గంటలు అయినా 12 గంటల పాటు పని చేసి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఉంది.
ముఖ్యంగా గ్యారేజీలలో పని చేసే వారిపై ఈ భారం అధికంగా ఉంది. దీంతో ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పేరుకే ప్రభుత్వోద్యోగం చేస్తున్నది మాత్రం వెట్టి అన్నట్లుగా తయారైంది. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే అంతంత మాత్రం. ఆ మాత్రం వేతనాలతోనే అధిక గంటలు పని చేయిస్తూ.. ఎక్కువ సమయం పని చేస్తే ఇవ్వాల్సిన ఓటీకి కూడా ఎగనామం పెడుతూ జగన్ సర్కార్ వారి శ్రమను నిలువునా దోచుకుంటోంది.