నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటిన్ లో వెల్లడి
posted on Feb 17, 2023 9:23AM
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ బులిటిన్ విడుదల చేశాయి. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ఆయనకు ఎమ్మారై స్కానింగ్ చేసినట్టు చెప్పాయి.
ప్రస్తుతం తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వివరించాయి. ఇలా ఉండగా ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం ( ఫిబ్రవరి 18) హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేశాయి.
ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెప్పారు. గురువారం(ఫిబ్రవరి 17) ఆయనకు ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితుల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందనీ, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారనీ తెలుస్తోంది.
అన్నిటికీ మించి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు బాలకృష్ణ వైద్యులతో సంప్రదిస్తున్నారనీ, వైద్యులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించిన అప్ డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారని చెబుతున్నారు.
గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే. ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ గతంలో వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పొటో ఒకటి కూడా గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో తారకరత్న క్లీన్ షేవ్ తో కనిపించారు.