గంజాయి కేసులో సుబ్బారావు గుప్తా అరెస్టు!
posted on Mar 1, 2023 @ 3:27PM
వైసీపీలో రెబల్ గా ఉన్నా, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా కష్టాలు ఎదుర్కోక తప్పదు. పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిల తరువాత తాజాగా వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాకు కూడా అనుభవం లోకి వచ్చింది. గంజాయి కేసులో పోలీసులు ఆయనను బుధవారం (మార్చి 1) అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఈ సుబ్బారావు గుప్తా ఎవరంటారా? గతంలో సుబ్బారావు గుప్తాపై బాలినేని అనుచరుల దాడి తదననంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వైసీపీ ఎమ్మెల్యే (అప్పట్లో మంత్రి కూడా) బాలినేని అనుచరుల చేతిలో దెబ్బలు తిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే ఈ సుబ్బారావు గుప్తా. అప్పట్లో బాలినేని ప్రధాన అనుచరులు ఒక లాడ్జిలో సుబ్బారావు గుప్తాను కొడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. మంత్రి బాలినేని అనుచరులుగా ఉన్న వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ సుబ్బారావు గుప్తా విమర్శించడంతో ఆయనను బాలినేని అనుచరులు ఒక లాడ్జి రూంలో చితక్కొట్టారు. మోకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఆ తరువాతి రోజే (అప్పుడు మంత్రి) బాలినేని తెరమీదకు వచ్చి సుబ్బారావు గుప్తాను ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారు. అయ్యిందేదో అయ్యింది... ఇక మనమంతా ఒకటే అంటూ కేకు కట్ చేసి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.
అయితే గుప్తా మాత్రం ఆ తరువాత వైసీపీ రెబల్ గా మారారు. తనపై దాడి చేసిన వారికి పోలీసులు రాచమర్యాదలు చేసి మరీ స్టేషన్ బెయిల్ ఇచ్చారని విమర్శలు గుప్పించారు. పర్యటనలు చేసి మరీ రాష్ట్ర వ్యాప్తంగా తనకు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. బెజవాడలో ఆర్య వైశ్య ఐక్యత సభ నిర్వహించి ఒంగోలులో చోట రాజన్, డీ గ్యాంగులు ఉన్నాయంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పిలిచినా తాను కలవలేదని కూడా అప్పట్లో ప్రకటించారు. సరే నెమ్మదిగా ఆ వ్యవహారం అంతా సైడైపోయిందని అంతా భావించారు. కానీ అప్పటి నుంచీ సుబ్బారావు గుప్తా వైసీపీ రెబల్ గానే ఉంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో సుబ్బారావు గుప్పా తన విమర్శల దాడిని తీవ్రం చేశారు. బాలినేని, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇక తాజాగా బాలినేని అనుచరుడు సుభాని తన అనుచరులతో కలిసి ఒక వసతి గృహంపై దాడి చేసిన సంఘటనలో బాలినేని తీరును నిరసిస్తూ సుబ్బారావుగుప్తా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలోనే సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఒంగోలులో సంచలనం సృష్టించింది. వైసీపీలో రెబల్ గా ఉంటే పోలీసుల మర్యాద ఇలాగే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.