వైసీపీకి దూరంగా విజయసాయి.. ఎవరు ఎవరిని వదిలేశారు?
posted on Mar 2, 2023 8:52AM
విజయసాయి రెడ్డి.. వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది. కొనసాగుతుందనే అంతా భావిస్తూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితిలో సమూల మార్పు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలనేమిటి? అలాగే కనిపిస్తోంది కూడా. పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ, విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.
ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించనున్న ఇన్వెస్ట్ మెంట్ సదస్సు విషయంలో కూడా విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆయన గడ్కరీతో ఒంటరిగా భేటీ అయ్యారు. భేటీకి కారణమడిగితే విశాఖ అభివృద్ధిపై మాట్లాడేందుకు అని అన్నారు. అయితే అదే విశాఖలో ఏపీ సర్కార్ నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు ఏర్పాట్ల విషయంలో విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా లేదు. విజయసాయి కేవలం ఎంపీ మాత్రమే కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి ప్రజా సంబంధాల విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా. అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి.
అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు. ఇంత కాలం పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్త మౌతున్నాయి. ఇటీవల తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెడుతున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అంతే కాకుండా జగన్ మెచ్చేలా ఇటీవలి కాలంలో ఆయన విపక్షంపై విమర్శలతో విరుచుకుపడటం లేదు.
అది కూడా ఆయన పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్నారనడానికి తార్కాణంగా చెబుతున్నారు. అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో ఆయన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా ఆయన ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు.
అయితే ఆ ట్వీట్ తరువాత ఎవరు ఎవరిని దూరం పెడుతున్నారు? విజయసాయి పార్టీకి కావాలనే దూరం జరిగారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం చిన్న చిన్న వ్యవహారాలు కాదనీ, జగన్, విజయసాయిల మధ్య దూరం పెరగడానికి వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. అవి రాజకీయ కారణాల కంటే పెద్దవి అయి ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్త మౌతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే విధంగా పార్లమెంటు వేదికగా సమాధారం రావడానికి కారణం విజయసాయి ప్రశ్నే అన్న విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. మొత్తం మీద విజయసాయి జగన్ కు దూరం కావడం, లేదా విజయసాయినే జగన్ దూరం పెట్టడానికి కారణాలేమైనా.. ఈ పరిణామం ముందు ముందు వైసీపీనే కాకుండా.. జగన్ ను కూడా చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2ల మధ్య అగాధంతో రానున్న రోజులలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.