విపక్షాల ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్?
posted on Mar 2, 2023 @ 11:26AM
విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్? ఈ వార్త ఒక్క సారిగా రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. ఔను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు విపక్షాల ఉమ్మడి ప్రధాని ఎందుకు కాకూడదు అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్బుల్లా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఎలా ఉన్న వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలు ఇప్పటి నుంచే చేయి చేయి కలిపి పని చేయాల్సిన అవసరం ఉందని, కాలయాపన ఇసుమంతైనా కూడదని బీహార్ సీఎం నితీష్ కూమార్ వంటి నేతలు అంటున్నారు. అంతే కాకుండా.. విపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలనీ చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. కాంగ్రెస్ నాయకత్వంలో జట్టుకట్టడం వినా మరో మార్గం లేదనీ నితీష్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. వారిరువురూ కూడా తమ, తమ నాయకత్వంలోనే విపక్షాల ఐక్యత ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ లు రెండూ కూడా ఎవరి దారి వారిది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
దీంతో బీజేపీయేతర పార్టీల ఐక్యత సవ్య దిశలో వెళ్లడం లేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే.. ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానం ఐక్యతా యత్నాలను మరో అడుగు వెనక్కు తీసుకువెళ్లిందనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలంటే.. విపక్షాలు ఏకం కావాలన్న అభిప్రాయంతో ఏ బీజేపీయేతర పార్టీకీ మరో అభిప్రాయం లేదు.. అయితే ఆ ఐక్య కూటమికి నేతృత్వం వహించేది ఎవరన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాలకు కారణం కూడా ప్రధాని పదవేనన్న విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ తన విధానం ఏమిటన్నది క్లారిటీ ఇచ్చేసింది. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేసిన కాంగ్రెస్ ఆ ప్రభుత్వానికి సారధ్యం వహించేది కాంగ్రెస్ మాత్రమేనని కుండ బద్దలు కొట్టేసింది.
అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్య కూటమి అధికారం చేపడితో ప్రధాని రాహుల్ గాంధీయేనన్నది ఆ పార్టీ శశభిషలకు ఆస్కారం లేకుండా స్పష్టం చేసింది. అయితే అంతలోనే స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ యూపీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత చేసిన ప్రతిపాదన విపక్షాల ఐక్యతా యత్నాలకు గండి కొడుతుందా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది. ఇప్పటికిప్పుడైతే స్టాలిన్ ప్రధాని అన్న ప్రతిపాదనపై రాజకీయంగా చర్చ అయితే జరుగుతోంది కానీ.. ఔను, కాదు అన్న కంక్లూజన్ కు అయితే ఏ పార్టీ రాలేదు. అదే సమయంలో సహజంగానే ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్ కానీ తృణమూల్ కానీ స్పందించ లేదు. ఎందు కంటే ఆ రెండు పార్టీలూ వేటికవిగా తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ స్పందన ఏమిటన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.
విపక్ష కూటమి తన సారథ్యంలోనే జరగాలని ఇప్పటికే ప్రకటించేసిన కాంగ్రెస్ తాజాగా ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కనీసంగానైనా ప్రభావం చూపని నేపథ్యంలో ఇంకా ప్రధాని పదవి కోసం పాకులాడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదే మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఒక్క కాంగ్రెస్ అనే కాదు.. విపక్ష కూటమి ప్రయత్నాలు సాగిస్తున్న పార్టీలన్నీ కూడా ఉమ్మడి ప్రధాని అభ్యర్థి విషయంలో ఒక అభిప్రాయం ప్రకటించడానికి ముందు ఈ ఏడాది జరిగే తొమ్మది రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూస్తాయన్న అభిప్రాయమే వెల్లడి అవుతోంది. స్వయంగా స్టాలినే కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష కూటమి.. మూడో ఫ్రంట్ చర్చే వేస్ట్ అని చెప్పిన నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా ప్రతిపాదనకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. పైగా ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రతిపాదన స్టాలిన్ జన్మదిన వేడుకలలో స్టాలిన్ సమక్షంలోనే చేశారు.