ఏపీలో జనం నెత్తిన ట్రూ అప్ చార్జీల పిడుగు.. ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలులో వంద కోట్ల అవినీతి!
posted on Mar 1, 2023 @ 10:55AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవగాహనా రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల పిడుగు పడుతోంది. తాను ముఖ్యమంత్రిని కనుక ఏమి చేసినా చెల్లుతుందని అహంభావం కారణంగానే ప్రజలకు మరోసారి విద్యుత్ భారం తప్పడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీల పెంపునకు రెడీ అయ్యారు.
ట్రూ ఆప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తప్పుపట్టారు. సీఎం అసమర్థత, చాతకాని తనం వల్ల జనం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తగ తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం కొన్ని యూనిట్ విద్యుత్ మూడు నుంచి మూడున్నర రూపాయలకు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుందనీ, గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను గౌరవించకుండా, రేటు తగ్గించాలని కోరడమే కాకుండా, వారి నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయకుండా మానేశారని మంగళవారం (ఫిబ్రవరి 28) రచ్చబండ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
పిపిఏ లను పునసమీక్షించేందుకు విద్యుత్ నిపుణుల కమిటీ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తో పాటు మరొక రెడ్డితో కమిటీ వేశారు. పిపిఏ లు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన పాత బకాయిలను నిలిపివేశారు. కొత్తగా విద్యుత్తును కొనడం ఆపివేశారు. ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ కు ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనితో యూనిట్ విద్యుత్ ధరకు అదనంగా రూపాయిన్నర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో పిపిఏ ఒప్పందాలను చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. పిపిఏలు చేసుకున్న సంస్థలకు యూనిట్ విద్యుత్తు ధర మూడున్నర చెల్లించడంతోపాటు ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ ఐదు రూపాయలకు కొనుగోలు చేయడం వల్ల , ప్రజలపై యూనిట్ విద్యుత్ భారం ఎనిమిది రూపాయలు పడింది. ఎక్స్చేంజిలో కాకుండా, అదే పిపిఏలు చేసుకున్న సంస్థల వద్ద విద్యుత్ ను కొనుగోలు చేసి ఉంటే మూడు నుంచి మూడున్నర రూపాయలకే యూనిట్ విద్యుత్ లభించి ఉండేది.
పాలకులు అజ్ఞానంతో , ఎక్స్చేంజిలో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపారు. హిందూజా ప్లాంట్ ఖాళీగా ఉంచినందుకు 1230 కోట్ల రూపాయలను అప్పుచేసి మరి ఆ సంస్థకు చెల్లిస్తున్నారు. ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజలు ట్రూ అప్ చార్జీల రూపంలో భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ప్రజలు భారం మోయాల్సి వస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో 100 కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.