టీపీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ లో ఉక్కపోత.. తెలుగుదేశం గూటికి చేరే యోచన?
posted on Mar 2, 2023 @ 2:47PM
మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి బై బై గుడ్ బై చెప్పేసి.. సొంత గూటికి అంటే.. తెలుగుదేశం పార్టీలోకి దూకేస్తారా.. తెలంగాణలో సైకిల్ స్పీడ్ పెంచేస్తారా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతోందంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు కాకపోయినా... ఎన్నికల తరువాత (ఒక వేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీలో ఏ పార్టీకీ అధికారాన్ని హస్తగతం చేసుకునే మెజారిటీ వచ్చే అవకాశాలు లేవనీ వినిపిస్తోంది.) అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ లు చేయి చేయి కలుపుకుని అధికారాన్ని అందుకుంటారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
అదీకాక నిన్నటి దాకా ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ ఒక్క సారిగా బీఆర్ఎస్ గా మారిపోయి జాతీయ పార్టీ అయిపోయింది. దీంతో బీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణ కాదు.. ఢిల్లీ అన్న సంకేతాలు ప్రజలలోకి బలంగా వెళ్లాయి. అందుకే రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ పొత్తులకు చేయి సాచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ముందు ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు జట్టు కట్టే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిసతోంది. అలాంటి తరుణంలో కేసీఆర్ ఫ్యామిలీతో కాంగ్రెస్ షేక్ హ్యాండ్ చేసినా.. రేవంత్ ఎంత టీపీసీసీ చీఫ్ అయినా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఔదాలుస్తారా అన్న డౌట్లు అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. కేవలం డౌట్లే కాదు.. కచ్చితంగా రేవంత్ బీఆర్ఎస్ తో లేదా కేసీఆర్ తో చేతులు కలిపే పార్టీలో ఇమడ లేరనీ, బయటకు వచ్చేస్తారనీ కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సపోజ్ ఫర్ సపోజ్ అదే జరిగితే.. రేవంత్ కు ఉన్న ఆప్షన్ ఏమిటి? అని కూడా చర్చ జరుగుతోంది. ఆ చర్చలో రేవంత్ తెలుగుదేశం గూటికి చేరడం వినా మరో ఆప్షన్ ఆయనకు లేదని కూడా అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు.. కేసీఆర్ ప్యామిలీని కూడా టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పించే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అనే టాక్ తెలంగాణ సమాజంలోకి చాలా బలంగా వెళ్లింది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీతో హస్తం పార్టీ చెయ్యి కలిపితే.. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ను వీడి బయటకు రావడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
మరోవైపు తెలంగాణలో రేవంత రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ టీపీసీసీ పగ్గాలు అప్పగించడంపై పార్టీలోని సీనియర్లు ఇటు రేవంత్ పైనా అటు పార్టీ హై కమాండ్ పైనా గుర్రుగా ఉన్నారు. వారంతా తిరుగుబాటుకు సిద్ధం కావడంతో అధిష్ఠానం గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణిక్ ఠాగూర్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టు కనిపించినా పరిశీలకులు మాత్రం రాజుకుంటోందనే అంటున్నారు. అధిష్ఠానం మొత్తం పార్టీ సీనియర్లందరినీ నియంత్రించి పూర్తి అధికారాలు రేవంత్ కు కట్టబెట్టే పరిస్థితులైతే లేవని పరిశీలకులు సైతం అంటున్నారు. రేవంత్ పాదయాత్రకు అధిష్ఠానం నుంచి అనుమతి రావడంలో జరిగిన తీవ్ర జాప్యాన్నే అందుకు నిదర్శనగా చూపుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉక్కపోతకు గురౌతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత తెలంగాణలో తెలుగుదేశంకు అవకాశాలు పుష్కలంగా మెరుగుపడ్డాయి. దానికి తోడు కాసాని జ్ణానేశ్వర్ తెలుగుదేశం తెలంగాణ పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎవ్వరూ ఊహించనంతగా సక్సెస్ అయ్యింది. దీంతో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న కేడర్ కూడా ఒక్క సారిగా చైతన్యవంతమైంది. మరిన్ని సభలు నిర్వహించాలన్న డిమాండ్ శ్రేణుల నుంచే పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ గతంలో పార్టీలో పని చేసి వివిధ కారణాలతో ఇతర పార్టీలకు వెళ్లిన వారి కోసం తెలుగుదేశం తలుపులు తెరిచే ఉన్నాయని ప్రకటించారు. హోమ్ కమింగ్ కు వెల్ కం చెప్పారు. కాసాని జ్ణానేశ్వర్ అయితే ప్రత్యేకంగా రేవంత్ పేరు పెట్టి మరీ ఆయనకు తెలుగుదేశం స్వాగతం పలుకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. భవిష్యత్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశం ఉందని లేశమాత్రంగా భావించినా రేవంత్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.