ఢిల్లీ మద్యం విధానం అమలులో లోపాలేంటి? కేజ్రీవాల్ ఎందుకు చెప్పరు?
posted on Mar 1, 2023 @ 3:27PM
అవినీతి వ్యతిరేక ఉద్యమ నేపథ్యంగా ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ ప్రభుత్వం ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికే ఆప్ కు చెందిన పలువురు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. అరెస్టయిన తరువాత ఆయన డిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం విధానం వివాదాస్పదం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దీనిని గత ఏడాది జూలైలోనే రద్దు చేసింది.
అయితే ఈ విధానం అమలులో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుం టున్నాయంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదు చేయడం, సీబీఐ విచారణకు కూడా అభ్యర్థించడంతో సీబీఐ దర్యాప్తు ఆరంభించింది. ఈ విధానం రూపకల్పన నుంచి అమలు వరకూ మనీలాండరింగ్ కూడా జరిగిందన్న అనుమానాలతో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. అసలు ఢిల్లీ నూతన మద్యం విధానం ఏమిటంటే.. మద్య విక్రయాలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించడం. సరే అదలా ఉంటే.. మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత కొంత కాలంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి విదితమే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తుసంస్థలను విపక్షాలను వేధించడానికి కేంద్రం వినియోగిం చుకుంటోందన్న ఆరోపణలు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఇప్పుడు ఆప్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలలో వాస్తవాలు ఎంత వరకూ ఉన్నాయన్నది పక్కన పెడితే.. సీబీఐ, ఈడీ మాత్రం ఢిల్లీ నూతన మద్యం పాలసీ అమలులో జరిగిన అవకతవకలు.. వాటికి సంబంధించి తమకు అందిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేపట్టామని సీబీఐ, ఈడీ అంటున్నాయి. ఇక మనీష్ సిసోడియాను అరెస్టు చేయడానికి కారణం ఆయన తమ విచారణకు సహకరించకుండా, సమాధానాలు దాటవేస్తుండటమే కారణమని సీబీఐ చెబుతోంది.
మరో వైపు బీజేపీ మనీష్ సిసోడియా అరెస్టు, మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగమేననీ, అందులో తమ ప్రమేయం ఏముందని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఆప్ ఆరోపణలు, సీబీఐ వివరణ, బీజేపీ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ చెప్పడం వేటికవిగా చూస్తే అన్నీదేని పని అది చేసింది... అనే అనిపిస్తుంది. కానీ ఒక్క మద్యం కుంభకోణం అని కాదు కానీ.. గత కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు బీజేపీయేతర ప్రభుత్వాలు, నాయకులు లక్ష్యంగానే పని చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవలసినది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారే అనడంలో సందేహమే లేదు. ఎందు కంటే.. ఇవే రకమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులపై ఈడీకానీ, సీబీఐ కానీ దృష్టి సారించిన దాఖలాలు కనిపించడంలేదు. ఆ కారణంగానే విపక్షాల విమర్శలకు, ఆరోపణలకు బీజేపీ వివరణ ఇచ్చుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. విపక్షాలే కాదు.. సామాన్య జనం సైతం ఏ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టినా.. ఏదో రాజకీయ కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టును కూడా రాజకీయంగానే చూస్తున్నారు. అయితే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆప్ సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవలసిన అవసరం ఉంది. అలా సమాధానం చెప్పకుండా... రాజకీయ కక్షతోనే దర్యాప్తు సంస్థల అరెస్టులు అని విమర్శలు గుప్పించినంత మాత్రాన ఢిల్లీ నూతన మద్యం విధానంపై వచ్చిన ఆరోపణలు, అనుమానాలు నివృత్తి అయిపోయినట్లు కాదు. ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన మద్యం విధానాన్ని అమలులో లోపాలున్నాయంటూ గత ఏడాది జులైలో ఎందకు రద్దు చేసింది. ఆ ఆ లోపాలేమిటో మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రే అరెస్టయిన నేపథ్యంలో అమలులో లోపాలేమిటన్నది ప్రజలకు వివరించాలి. అందుకే మద్యం కుంభకోణం విషయంలో సీబీఐ విశ్వసనీయత ఎలా ప్రశ్నార్థకంగా ఉందో.. మనీష్ సిసోడియా విశ్వసనీయత కూడా అలాగే ప్రశ్నార్థకంగా మారింది.
అన్ని రకాలుగా మనీష్ సిసోడియాను సమర్ధిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మనీష్ సిసోడియా రాజీనామాను క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదించడం, ఇదే కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న మరో మంత్రి కూడా ఇప్పుడే, అంటే మనీష్ సిసోడియా అరెస్టై, తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాతే రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.