విజయ ‘సాయిలెన్స్’.. కారణం అదేనా?
posted on Mar 1, 2023 @ 12:46PM
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయాసాయిరెడ్డి సైలెన్స్ వెనుక కారణాలేమిటన్న చర్చ ఆ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. నిత్యం విపక్షాలపై విమర్శలతో, ట్వీట్లతో తెలుగుదేశం అగ్రనేతలపై వ్యంగ్య కామెట్లతో వార్తల్లో ఉండే విజయసాయి గత కొంత కాలంగా నిశ్శబ్దం పాటిస్తున్నారు. పార్టీ వేదికలపైనా, కార్యక్రమాలలోనూ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కాక వైసీపీ శ్రేణులు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. నిత్యం.. పార్టీలోని నాయకులతోనో.. కార్యకర్తలతోనో భేటీ కావడం... లేదా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం.. అదీ కాదనుకుంటే.. సామాజిక మాధ్యమం ద్వారా ప్రతిపక్ష పార్టీల అధినేతలు, నాయకులపై విమర్శలు గుప్పించడం చేస్తుండే విజయ సాయి హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం పార్టీ శ్రేణుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు విజయసాయిరెడ్డి.. సమీప బంధువు నందమూరి తారకరత్న మరణం, ఆ తరువాత ఆయన తెలుగుదేశం అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణతో ఒకింత సేపు మాట్లాడటంతో వైసీపీ అధిష్ఠానం ఆయన్ని దూరంగా పెట్టిందనే ప్రచారం కూడా జోరందుకుంది. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డిని స్టేట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారని అంటున్నారు. ఇంకోవైపు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నందమూరి తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఆసుపత్రి వైద్యులను అడిగి మరీ తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన చాలా వివరింగా వివరిస్తూ మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాటల ద్వారా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ప్రజలందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చిందనే ఓ టాక్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే తారకరత్న ఆరోగ్యంపై ఇంత క్లారిటీగా చెప్పిన విజయసాయిరెడ్డి.. 2019, మార్చి 15న దారుణ హత్యకు గురైన వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారంటూ విజయసాయిరెడ్డిని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా ఆయన సెలెంట్ గానే ఉండిపోయారు. తారకరత్న మరణం, అంతకు ముందు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకూ పూర్తి భిన్నంగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాటిని ఖండిస్తున్నట్లుగా విజయసాయి మాటలు ఉన్నాయి. ఇదే జగన్ కు ఆయనపై ఆగ్రహం కలగడానికి కారణంగా పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అయితే విజయసాయి మౌనం వెనుక అత్యంత బలమైన కారణముందన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయితే.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ మొట్టమొదటగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించిందీ విజయసాయిరెడ్డేనని ఇప్పుడు అదే తన తలకు చుట్టుకుంటుందన్న భయంతోనే విజయసాయి మౌనం వహిస్తున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ.. దూకుడు పెంచడం, ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన నేపథ్యంలో వివేకా హత్య కేసు సాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి వస్తుందని అటు రాష్ట్ర ప్రజలే కాదు.. ఇటు వైయస్ వివేకా ఫ్యామిలీలోని వారు సైతం భావిస్తున్నారు.
మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో చోటు చేసుకున్న వరుస పరిణామాలపై ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా హు కిల్డ్ బాబాయి అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చమత్కార బాణాలు విసురుతున్నారు. ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో భాగంగా వైయస్ వివేకా హత్యపై జగన్ ప్రభుత్వానికి వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
కానీ వీటికి విజయసాయిరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా గతంలో లాగా తనదైన శైలిలో స్పందించడం లేదని... ఓ వేళ.. వీటికి ఆయన తన తరహాలో స్పందిస్తే.. అందుకు కౌంటర్‌గా వివేకా గుండెపోటుతో మరణించారంటూ నీకు ఎవరు చెప్పారంటూ సీబీఐ రంగంలోకి దిగి.. ఈ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదని.... ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఓ టాక్ వినిపిస్తోంది.