అమరావతి కేసు తక్షణ విచారణకు సుప్రీం నో.. మరో సారి జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ!
posted on Mar 2, 2023 @ 12:59PM
జగన్ ప్రభుత్వానికి సర్కార్ లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ చేసిన విజ్ణప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గతంలో చెప్పిన విధంగా ఈ నెల 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో సర్కార్ దిక్కు తోచని స్థితిలో పడినట్లైంది.
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతూ వస్తున్నది. తాజాగా గురువారం (మార్చి 2) మరో సారి జగన్ సర్కార్ ఈ విషయాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది. గతంలో చెప్పని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పదే పదే అభ్యర్థనలు చేస్తున్నది.
మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ కు సుప్రీంలో అమరావతి కేసు ఈ నెల 28 వరకూ విచారణకు వచ్చే అవకాశం లేకపోవడం ఒకింత ఇబ్బందికరంగా పరిణమించింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం అసహనానికి గురి చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలన్నట్లుగా జగన్ సర్కార్ తొందరపాటు ఉన్నది. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే మారిందని పరిశీలకులు అంటున్నారు. శుక్రవారం (మార్చి 3) నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. అందుకే జగన్ సర్కార్ గురువారం కూడా సుప్రీంలో ఈ కేసు విచారణ కోసం ఒక ప్రయత్నం చేసింది. అది కూడా విఫలం అయ్యింది.
దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో విశాఖ రాజధాని అన్న ప్రకటన చేసే అవకాశం జగన్ సర్కార్ కు ఇక లేనట్లే. కాగా జగన్ సర్కార్ వినతిని తోసిపుచ్చుతూ జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయనీ, విచారణ చేపట్టి అన్నివిషయాలూ తేలుస్తామని వ్యాఖ్యానించారు.