కొలీజియం తరహాలో ఈసీల ఎంపిక.. సుప్రీం
posted on Mar 2, 2023 @ 1:38PM
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఏ ప్రాతిపదికన, ఎవరు నియమిస్తారంటూ దాఖలైన ఒక పిల్ ను విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తల నియామకం ఏ విధంగా అయితే కొలీజియం ద్వారా జరుగుతుందో.. అదే విధంగా ఒక ఉన్నత స్థాయి ప్యానల్ ద్వారా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకం జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులున్న కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కొలీజయం ద్వారా సాగినట్టే ఈసీ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఓ పద్ధతి ప్రకారం సాగాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది రిజర్వ్ చేసిన తీర్పు బుధవారం వెలువరించింది. తమకు అనుకూలురైన వ్యక్తులను ఈసీలు, సీఈసీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజా తీర్పుతో కేంద్రానికి ఈ విషయంలో సుప్రీం మార్గదర్శకత్వం చేసింది. రాజ్యాంగ నిపుణులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఎన్నికల సంఘం నియామకాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చేస్తూ వచ్చింది.
ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గోయల్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా మోడీ సర్కారు నియామకం చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. గోయల్ నియామకం వివాదాస్పదమైంది. మొత్తంగా గోయల్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిక ప్రక్రియ మొత్తం ఒక్క రోజులో పూర్తైపోయింది. దీనినే సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అదే సమయంలో గోయల్ అభ్యర్థిత్వాన్ని కాదనీ, తాము తప్పుపడుతున్నది అందుకు అనుసరించిన ప్రక్రియనేనని సుప్రీం అప్పట్లోనే పేర్కొంది.
గత ఏడాది నవంబర్ 18న ఐఏఎస్ గా రాజీనామా చేసిన గోయెల్ ను ఆ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే అంటే నవంబర్ 21నే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదే వివాదానికి కారణమైంది. దీనిపైనే సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుపట్టింది.