రాజధాని కేసు.. ఏపీ అత్యవసర విచారణ వినతిని పట్టించుకోని సుప్రీం
posted on Feb 28, 2023 @ 2:25PM
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వచ్చేనెల 3,4 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని విషయంలో సుప్రీం కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఎదురు లేకుండా చక్రం తిప్పవచ్చని భావించిన జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు నిర్ణయం మింగుడు పడటం లేదు. మూడు రాజధానుల విషయం ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రిం కోర్టులో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే నెల 28న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ పరిస్థతి కక్కలేకా.. మింగలేకా అన్నట్లుగా తయారైంది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సుప్రీంను ఆశ్రయించకుండా.. తీరిగ్గా ఆరు నెలల తరువాత అత్యవసర విచారణ కావాలంటూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు వచ్చే నెల 28న విచారణకు స్వీకరిస్తామంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే జగన్ సర్కార్ అత్యవసర విచారణ అంటూ కోరిన తరువాత ఈ కేసు విచారణ వెనక్కు వెళ్లడం ఇది మూడో సారి.
హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.
ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం. అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది.
కాగా రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు తాజాగా
సోమవారం (ఫిబ్రవరి 27) మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాల త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా విన్నవించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
మరోవైపు వచ్చే ఏడాది వేసవిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని అంశం అన్ని పార్టీలకు అజెండా అంశంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాలనా పరంగా మూడు రాజధానుల నిర్ణయం వైసీపీకి కీలకంగా మారింది. ఇందులో భాగంగానే విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును విచారణ వేగవంతం చేయాలని కోరుతోంది. అయితే సుప్రీంకోర్టు మార్చి 28న ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.