ఈశాన్యంలో కమల వికాసం.. మరి దక్షిణాదిన?
posted on Mar 6, 2023 @ 5:15PM
ఒకప్పుడు బీజేపీ అంటే ఉత్తర భారత్ పార్టీ ... ఇప్పటికీ, దక్షిణ భారత దేశంలో బీజేపీకి ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ బలం, బలగం లేవు. ఇప్పుడిప్పుడు తెలంగాణలో ఒకింత బలపడుతున్నా ఈ సంవత్సరం (2023) చివర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి కాకున్నా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను అయినా పొందగలుగుతుందా అంటే, అనుమానమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గానీ, తెలంగాణలో బీజేపీది బలుపా వాపా అన్నది తేలదు. సరే, దక్షిణ భారత దేశంలో బీజేపీ భవిష్యత్ ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల (త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ) విషయానికి వస్తే ఈశాన్యంలో బీజేపీ మరోమారు సత్తా చాటుకుంది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ రెండు చోట్ల జయకేతనం ఎగురవేసింది.
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ కూటమి విజయం సాధించగా మేఘాలయలో హంగ్ ఏర్పడింది. త్రిపురలో బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి విజయం సాధించింది. మరో రెండు రోజుల్లో అంటే బుధవారం (మార్చి 8) వరసగా రెండవ సారి బీజేపీ ప్రభుత్వం త్రిపురలో కొలువు తీరేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే, ఇంతవరకు ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి మానిక్ షా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడుతున్నారు.
అలాగే, నాగాలాండ్ లోనూ బీజేపీ కూటమి విజయం సాధించింది. 60 స్థానాలకు గానూ ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమి 37 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 12 స్థానాల్లో, నేషనలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీపీ) 25 స్థానాల్లో గెలిచాయి.ఈ విజయంతో నాగాలాండ్ రాజకీయ దిగ్గజం, నేషనలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీపీ) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నెయిఫియు రియో వరుసగా ఐదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.అయితే, ఏడుసీట్లు గెలుచుకున్న ఎన్సీపీ, ఐదు సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ, ఒకటి రెండు సీట్లు గెలుచుకున్న జేడీయు, ఎల్జీపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, ఆర్పీఐ పార్టీలు, ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాయి. దీంతోనాగాలాండ్ లో మరో మారు ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేఘాలయ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.26 స్థానాల్లో గెలిచిన ఎన్‌పీపీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ(యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ) 11 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా బీజేపీ, యూడీపీతో కలిసి సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
నిజానికి 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కంటే దయనీయంగా ఉంది. (త్రిపురలో 4/60, మేఘాలయ 5/60, నాగాలాండ్ 0/60) కంటే అద్వాన్న స్థితిలో వుంది. అయితే ఇప్పడు మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. అయితే, దక్షిణాదిలో అదే పరిస్థితి వస్తుందా? ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్ణాటకలో అధికారం నిలబెట్టుకుని, తెలంగాణలో ప్రభుత్వంలో రాకున్నా, గౌరవప్రదమైన స్థానాలు పొందగలుగుతుందా? అంటే, ఇప్పటికిప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పడం చాలా కష్టమే అంటున్నారు విశ్లేషకులు.