మోడీ పై కేసీఆర్ లేఖాస్త్రం కవితను రక్షించుకునేందుకేనా?
posted on Mar 6, 2023 @ 1:42PM
‘దుర్వినియోగం కాని అధికారం అధికారమే కాదు’ (Power is no power, if it is not misused) ఇదొక ఇంగ్లీష్ నానుడి. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడతాయి. అది అభిలషణీయం కాకపోయినా అదే నిజం. అదే వాస్తవం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారత చరిత్ర చెపుతున్న సత్యం ఇది.
అధికారంలో ఎవరుంటే వారు రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 2014లో మొదలైన అపచారం కాదు. బీజేపీ పుట్టక ముందే ఈ దురాచారం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంది. ఇప్పడు బీజేపీ కూడా అదే పని చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో వంద సార్లకు పైగా ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) దుర్వినియోగం అయింది. 1959లోనే కేరళలోఇఎమ్‌ఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వానికి అసెంబ్లీ మెజారిటీ ఉన్నప్పటికీ, కేంద్రం బర్తరఫ్ చేసింది. రాష్ట్రపతి పాలనా విధించింది. ఇక అప్పటి నుంచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో వంద సార్లకు పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో ఆర్టికల్ 356 దుర్వినియోగం అయింది. అలాగే, కాంగ్రెస్ హయాంలో సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగం గురించి విపక్షాలు విమర్శలు చేయడం కాదు, సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సిబిఐని ‘పంజరంలో చిలక’ (Parrot in the cage) అని పేర్కొన్నది.
అలాగని, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్పని కాదు చేయకూడదనీ కాదు. అయితే ఈ ఆరోపణలను ప్రజలు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారు అనేదే, ప్రశ్న.
అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ నేపధ్యంతో ప్రజా తీర్పును గౌరవించాలంటూ ప్రధాని మోడీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ లేఖపై నలుగురు సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, యేపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంతకాలు చేశారు. గ
వర్నర్ వ్యవస్థను రాజకీయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. నిజమే కానీ, ఈ లేఖ రాసిన సమయం సందర్భం, అందులోని అంశాలను గమినిస్తే, ప్రజలు విపక్షాల ఆరోపణలను, (ముఖ్యంగా తెలంగాణ ప్రజలు) ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు అనేది అనుమానమే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె రక్షించుకునేందుకే లేఖాస్త్రాని సంధించారని అంటున్నారు.
నిజానికి సిసోడియా అరెస్ట్ నేపధ్యంగా కేసీఆర్, ఇతర నేతలు లేఖ రాసినా కవితను కాపాడుకోవడమే కేసేఆర్ ప్రధాన లక్ష్యమని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని అంటున్నారు. అయితే ఎవరేమన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈ లేఖలో సంతకాలు చేసిన నేతలు పేర్కొన్నట్లుగా, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు.. ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారు.